Jump to content

పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తెలుగువాడు తెలుగుకు కట్టిన పట్టం

చనానికి కండబలం, గుండెబలం ఇచ్చిన రచయితల్లో శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రిగారు గణనీయులు. ఆధునిక తెలుగు కథకు గురజాడ జీవం పోస్తే తరువాతి తరంలోని శ్రీపాదవారు దానికి జవం కల్గించారు. కవనం - వచనం రెండూ సమాంతరంగా తెలుగు సాహిత్యాన్ని పరిపుష్టం చేస్తున్న కాలంలో వచనానికి పెద్దపీట వేశారు. సుబ్రహ్మణ్య శాస్త్రిగారు చిక్కని తెలుగుదనం ఉడుపులో గ్రామీణ భావజాలం, పోయిన పోకిళ్లూ, సోయగాలూ దర్శించాలంటే శ్రీపాద వారి వచనం చదవాల్సిందే!

కథలకు వర్టికల్ గానూ హారిజాంటల్‌గానూ విరాడ్రూపం కల్పించింది శ్రీపాద వారే. ఈ శతాబ్దం అయిదూ, ఆరూ దశకాలలో విరివిగా వచ్చిన నవలికలకు వీరి కథలే తొలిరూపాలు. తెలుగు వేళ్లున్న అంతర్జాతీయ కథకుడు. వీరి కథలను మూడు సంపుటాలుగా ఇంతకు ముందే మేం అందించాం. పాఠకులు చాలా ఆప్యాయంగా ఆదరించారు. ప్రస్తుతం శ్రీపాద వారి ఆత్మీయ కథ "అనుభవాలూ - జ్ఞాపకాలూను" అన్న గ్రంథాన్ని మీ కందిస్తున్నాం. నీలంరాజు వెంకటశేషయ్యగారు నడిపిన “నవోదయ”లో తొలిసారిగా ఇది క్రమంగా వచ్చింది. ఆదిలో దీన్ని 3 సంపుటాలుగా ప్రకటించారు. రచయిత అకాలమరణంవల్ల ఈ గ్రంథం అసంపూర్ణంగా ఆగిపోయింది.

వీరేశలింగంగారి స్వీయ చరిత్రతో ఆరంభమైన ఆధునిక స్వీయచరిత్ర ప్రక్రియలో ఇప్పటికి సుమారు వందకు పైనే గ్రంథాలు వచ్చాయని ఈ శాఖలో ప్రత్యేకకృషిచేసిన శ్రీ అక్కిరాజు రమాపతిరావు అంచనా. అందులో ఈ రచన పురిపండా అప్పలస్వామిగారి మాటల్లో "భారతీయ భాషల్లో నేనెరిగినంతవరకూ ఈరకం గ్రంథం లేదు". శ్రీపాదవారు "1924 నుండి వ్యవహారిక భాషా ఉద్యమానికి అండదండలందించారు". భావ సంఘర్షణ, ఆచార సంఘర్షణ, ఆచరణ సంఘర్షణల కాలంలోని శ్రీపాదవారికి హిందీ, గాంధీ-ఖద్దరు అంటే ఎలర్జీ. 1921 నుండి సుబ్రహ్మణ్య శాస్త్రిగారు నడిపిన ప్రబుద్ధాంధ్ర పత్రిక తమ సిద్ధాంతాల ప్రచారానికి ఓ ఉద్యమంగా పని చేసింది. 1934 నుండీ పద్యాలను నిషేధించి వచనానికే కేతనమై వచన రచయితలనందర్నీ ఒక తాటిపైకి తెచ్చింది. ప్రస్తుతం ఈ గ్రంథంలో "అనాటి తెనుకు పల్లెటూళ్ల జీవితము, ఆచారములు, శ్రౌతుల గృహాల శోభ, ఆ సంస్కృతి, సర్వము రమణీయము"గా దర్శించగలం. వాటి సభ్యతా చరిత్రకిది నిలువుటద్దం. “సత్య ప్రఖ్యాపనకు తార్కాణంగా నిలిచిన సజీవ సాహిత్య సంపుటం. శ్రీపాదవారి కథలను ఆదరించినట్లుగానే ఈ గ్రంథాన్ని సైతం తెలుగు పాఠకులు ఆదరిస్తారని ఆశిస్తూ...

ఏటుకూరి ప్రసాద్‌

సంపాదకుడు