Jump to content

పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆ యింటో భోజనాలయి వుండినా, అవుతూ వుండినా, యిల్లాలు వచ్చి కొంచెం అన్నం జోలెలో పడేస్తుంది.

వట్టి అన్నం పెట్టకూడదు కనక, కాస్త పప్పో, కాస్త కూరో, ఆవకాయబద్దో కూడా జోలెలో పడేస్తుం దామె, అందుకోసం జోలెకు అర లుండాలి.

ఇలాగ, మధ్యాహ్నం మాత్రం యింటింటికీ తిరిగి, రెండుపూట్లకో మూడు పూట్లకో చాలినంతా సంపాదించుకుని, ఆ పూట తిన్నది పోగా మలిపూటకి జాగ్రత్త చేసుకోవాలి, మిగిలింది.

రెండో పూటకు మిగుల్చుకున్నది యే పిల్లి అయినా కొట్టేస్తే, మళ్లీ మరికొన్ని యిళ్ళకు బయలుదేరాలి సాయంత్రం, తన అవస్థ చెప్పుకుంటూ, లేకపోతే పస్తుండాలి.

ఇందుకు సిద్దపడతాడా - ఆ విద్యార్థికి అన్నం సమృద్ధి.

ఒక్కొక్కప్పుడు, ఏ భిక్షకుల కయినా పెట్టడానికిన్నీ తగినంత సమృద్ధి అది.

కూర, యిళ్ళవారి కొక్కొక్కటే గాని, విద్యార్థికి అనేకాలు, జమీందార్లనున్నూ మించి.

నిజమే కాని చారూ పులుసూ మాత్రం వుండవు.

ఒక్కొక్కచోట బస యిచ్చినవారు కాస్త వడ్డించడం వుంటుంది కాని, లేకపోతే వాటికి నీళ్ళు వదలుకోవాలి.

మజ్జిగ మాత్రం దొరుకుతుంది, కొనుక్కోవచ్చు, కనక.

మజ్జిగ అంటే, చేసింది కాదు, కొనుక్కోగలిగితే పెరుగే కొనుక్కోవచ్చు, రెండు పూట్లకీ.

కాని, నొక్కొక్కచోట చిక్కు లుంటాయి, దానికీ.

ఒక వూళ్ళో, వొక విద్యార్థి సులభంగా వారాలు దొరికే పూరయినా, మాధుకరమే చేసుకునేవాడు, స్వేచ్ఛ కనక.

చదువుమీద వుండినంత శ్రద్ధా సంభావనలమీద కూడా చూపించేవా డతను, డబ్బుకి లోటు లేక కొన్నాళ్ళు పెరుగే కొనుక్కున్నాడు.

కాని, దాంతో బస యెగిరిపోయే స్థితి వచ్చిం దతనికి.

ఆ యింటివారి కొడుకు గారాల కూచి.

వారు సంపన్నులు కారు.

తల్లి కొడుక్కి మజ్జిగే పోసేది.

కుర్రవాడు పేచీ మొదలు పెట్టాడు విద్యార్థి భోజనం చూసి, తనకూ పెరుగే పొయ్యమని.

అప్పు డా యిల్లాలు విద్యార్థిని నిర్బంధించి "నువ్వు పెరుగు మానుకో - లేకపోతే నువ్వు కొనుక్కున్నది. మా వాడికిన్నీ కాస్త పోస్తూ వుండు” అని.

పరిస్థితు లలా యేర్పడుతూ వుంటాయి అనుకోకుండా, యెవరేమి చెయ్యగలరూ?

దేనికయినా, సుఖాలతో పాటు కష్టాలూ వుంటాయి. నీడల్లాగ.

అయితే, యీ వారాల పద్దతీ, యీ మాధుకరం వృత్తి నేటివి కావు, ఋషివాటికల్లో మునిబాలకు లవలంబించిన మహోత్తమవృత్తులు.

40

శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి - 1