రకరకాల విద్యార్థులతొ సహవాసం.
గురుప్రీతి సంపాదించుకోడంలోనూ, వూరివారి మంచితనమున్నూ సంపాదించుకోడంలోనూ విద్యార్థులకు పోటీలు.
ఈ పోటీలలో రకరకాల కల్పనలూ, కుట్రలూ కూడా వుంటాయి, తరుచు.
కొందరు విద్యార్థులు కొంటెపనులు మానలేదు. దాంతో, చెయ్యనివారికిన్నీ మందలింపులు తగులుతూ వుంటాయి.
ఊరివిద్యార్థులు, తా మధికుల మన్నట్టు, పొరుగూరి విద్యార్థులమీద సవారీ చెయ్యబోతూ వుంటారు.
చదువుసంధ్య ళ్లేని ఊరియువకులు చేసే హంగామా వర్ణనాతీతంగా వుంటూ వుంటుంది.
బస యిచ్చిన ఉదారులుంటారు, వారినీ సేవించుకుంటూ వుండాలి.
స్వగ్రామంలో, స్వగృహంలో కూడా అగత్యం లేని యిన్ని పనులు చేస్తూ, యిన్ని ఢక్కా మొక్కీలకు ఆగివుంటే, అప్పుడూ చదువు.
ఇన్ని చేసినా, శ్రద్ధగానే చదివినా, చదువు అంటే యోగం వుండాలి, అది మనచేతిలో లేదు.
ఇలాగ, వారాలు చేసుకునే విద్యార్థికి, అవలంబించేది బ్రహ్మచర్యమూ, ఈదేది సంసారసాగరమూ అయి, చదువుతోపాటు గృహకృత్యాలు నిర్వహించుకునే నేర్పు కూడా అలవడుతుంది, అప్రయత్నంగా.
ఇంగితజ్ఞానమూ కలుగుతుంది, సంస్కారానికి తగ్గట్టు.
వారాలు చేసుకుంటూ నేను చదువుకున్న కాలం నాలుగైదేళ్ళకి పైని.
ఈ అనుభవాలన్నీ కలిగాయి, నాకు.
వారాల పద్ధతి యిలా వుండగా, గురుకులవాసంలో మాధుకరవృత్తి వొకటుంది.
తుమ్మెద కాస్త కాస్త చొప్పున పువ్వుపువ్వునుంచీ మకరందం సంపాదించుకుంటుంది.
భోజనం విషయమై విద్యార్థి కిది సరిగా అలాంటి వృత్తి.
కానయితే నే నెక్కడా అవలంబించలేదు గాని, వారాలు పద్ధతికంటే, యిది మిక్కిలీ ఉత్తమం.
ఎంత ఉత్తమం అయినా ప్రతీదాన్లోనూ కొంచెమో గొప్పో యిబ్బందులూ వుంటాయి.
మొదట ఆ వూరి బ్రాహ్మల భోజనాలవేళ గుర్తించుకోవాలి, విద్యార్థి.
స్నానం చేసి మడిబట్టో, పట్టుపంచో - కనీసం నారబట్టో కట్టుకోవాలి.
కుడిచేత, జోలెకు సాయం, నీళ్ళతో చెంబున్నూ పుచ్చుకోవాలి. అది లేకపోతే మడి చెడుతుంది, దృష్టిదోషం కలిగి సంపాదించుకున్న అన్నాదికమూ అభోజ్యం అయిపోతుంది.
ఈ జాగ్రత్త చూసుకుంటూ, ఇంటింటికీ వెళ్ళి వీధి గుమ్మాన లేక తలుపు తెరిచివుంటే హాల్లో నుంచుని "భవతీ, భిక్షాం దేహి” అనాలి, వంటింటవున్న స్త్రీలకు వినపడేటట్టు.
అనుభవాలూ - జ్ఞాపకాలూను - 1
39