Jump to content

పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఒక యిల్లాలు పంక్తిభేదం చూపిస్తుంది.

ఈ చిరాకంతా పోగొట్టడానికే అన్నట్టు ఒక్కొక్క యిల్లాలు, తల్లిలాగ బుజ్జగిస్తూ పెడుతుంది.

ఈ వ్యత్యాసాలకు తోడు, వేళాపాళా వుండదు.

ఒక అంతస్థున్నూ వుండదు.

ఈ రకరకాల భోజనమయినా, యిచ్ఛామాత్రంగా దొరకదు.

గురువుల విషయం చూతామా అంటే, అదో ప్రపంచం.

సామాన్యంగా, వేదవేదాంగాలు చెప్పే గురువు లందరూ మధ్యరకం సంసారులయి వుంటారు.

ఈనాములూ వుంటాయి, వొడిదుడుకులూ వుంటాయి, సమంగా వారికి.

అంటే, ఉన్నది చాలదు, యేకొంతో సంపాదించాలి, తప్పనిసరిగా.

అదంతా చూసుకుంటూ పాఠాలు చెబుతారు వారు, నిస్స్వార్థంగా.

కనక, విద్యార్థి, ఆ పనిలోనూ యీ పనిలోనూ సాయం చేస్తూ, గురువుగారికి, పాఠ ప్రవచనాల కవకాశం కల్పించుకోవాలి.

గురువు పొరుగూళ్ళు వెడితే కూడా వుంటూ, తన మూటతోపాటు ఆయన మూటా మొయ్యాలి.

ఆయన స్నానం చేస్తే, విడిచిన బట్ట వుతికి ఆరెయ్యాలి.

గురుపత్ని కన్నబిడ్డ అన్నట్టే చూసుకుంటుంది కాని; ఆ పనీ యీ పనీ చెబుతుంది.

ఒక్కొక్కచోట గురువుల చంటిపిల్లలను సముదాయించవలసిన్నీ వుంటుంది.

మా చిన్నన్నగారిచేత, వొక గురుపత్ని, పశువుల సాల బాగుచేయించి పిడకలున్నూ చరిపించింది, కొన్నాళ్ళు.

గురువుగారు, ఏదో నిర్వహించుకు రమ్మని పొరుగూరు పంపితే, వార్తాహరత్వమున్నూ నిర్వహించాలి.

ఒక్కొక్క గురువుదగ్గిర, పొరుగూళ్లు వెళ్ళినప్పుడు వంట చెయ్యవలసిన్నీ వుంటుంది.

ముగ్గురు గురువులకు ముక్కుపొడుము తయారుచేసి యిచ్చేవాణ్ణి నేను, నేటికీ అది వాసన అయినా చూడకపోయినా.

గురువుగారిమాటకేం, కొన్నిచోట్ల, విద్యార్థిని గ్రామ నౌకరుగా భావించే వూరిపెద్ద లుంటారు, కొందరు.

కొన్నిచోట్ల, వూరుమ్మడిమీద సంతర్పణలూ సమారాధనలూ యేమయినా జరిగితే, వడ్డన వగయిరాలు విద్యార్థులే చెయ్యాలి.

ఇన్ని చేసినా, నిన్న చెప్పిన పాఠం గట్టిగా వల్లించి వుండకపోతే యివాళ పాఠం చెప్పరు, గురువులు.

దినమ్మూ, ఉదయం, పాత పాఠాలు చింతన వేసుకోక పోయినా అంతే, కొత్త పాఠం చెప్పరు.

ఇదిన్నీ యిలా వుండగా, -

38

శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి - 1