Jump to content

పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/585

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మూడోప్రతి గోపాలాచార్యులుగారి కిద్దామని వెళ్లాను.

కాని వారూరికి వెళ్లారు, వారి దర్శనం కాలేదు.

"పిఠాపురం వెళ్ళారు వారు. ఇప్పుడే వెళ్ళారు మెయిలుకి. తొందరపనయితే సెంట్రల్ స్టేషనులో కలుసుకోవచ్చు వారి" నని చెప్పారు గుమాస్తాలు.

ట్రామెక్కి వెళ్ళాను.

సెకండుక్లాసు కంపార్టుమెంటులో కూచుని వున్నా రాచార్యులుగారు.

అప్పటికి - నాగేశ్వరరావుగారూ, వావిళ్ళ వెంకటేశ్వర శాస్త్రిగారూ, గోపాలాచార్యులుగారూ - మద్రాసు కంతకూ యీ ముగ్గురే నేనంటే ప్రత్యేకశ్రద్ధ చూపేవారు.

అంచేత, వారి ముగ్గురికీ మొదటి మూడుప్రతులూ యివ్వాలని నా సంకల్పం.

నా ప్రయత్నం యిదే, కాని వొక అసందర్భం జరిగిందావేళ.

"ఇది నా కొత్తనవల బైండుపని పూర్తి అయి ఇప్పుడే నా చేతికి వచ్చింది. తమకోసం కాలేజీకి వెళ్ళాను. తా మూరికి వెడుతున్నట్టు చెప్పారు గుమాస్తాలు. ప్రయాణంలో సావకాశంగా చదువుతారన్న వూహతో తెచ్చాను" అని చెబుతూ పుస్తకం వారి చేతిలో వుంచాను.

పేరు చూశారంతే, వారు.

వారి చూపుల్లో అసంతృప్తి కనపడింది.

“తంతివార్తరాగా వైద్యం పనిమీద లక్ష్మీనరసాపురం వెడుతున్నా న్నేను. ఇదా నాకు శకునం యిప్పుడు? ఈ మాత్రం అయినా ఆలోచించారుగారేం శాస్త్రులుగారూ?” అనడిగా రాచార్యులుగారు.

దురుసుగా అడగలేదు.

వారి మొగం ప్రసన్నంగానే వుంది.

కాని, సిగ్గుపడిపోయాన్నేను.

చాలా పరితపించాను.

ఏమిటేమిటో చెప్పుకోడం ప్రారంభించాను.

వెంటనే "వద్దువ”ద్దంటూ లేచివచ్చి, నన్ను కంపార్టుమెంటులోకి తీసుకువెళ్ళి, తమ పక్కని కూచోపెట్టుకున్నారు, ముందు, వారు.

వీపు తట్టారు.

"ఊరికే, చమత్కారాని కన్నాను. మరేమీ అనుకోకండి. కావలసిందెలా వుంటే అలా అవుతుంది. చికిత్స సందర్భంలో నేనిలాంటివి చూడను."

నాయెడల మీ భావా లెలాంటివో నాకు తెలుసు. అది మరిచిపొండి" అంటూ చాలా చెప్పారు, కూడా.

బండి కదిలేదాకా చెబుతూనే వున్నారు.

మర్నాడులేదు, ఆ మర్నాడు వర్తమానం వచ్చింది నన్ను రమ్మని.

"వెళ్ళినపని వాకిట్లోనే అయింది. పిఠాపురంలో దిగాను. రోగి చనిపోయినట్టు చెప్పారు. పిఠాపురంలోనే నాకు బసయేర్పాటు చేశారు. తిరుగుమెయిల్లో వచ్చేశాను" అన్నారు వారు, మొదట.

అనుభవాలూ - జ్ఞాపకాలూను - 3

561