ఇది విని ద్రోణంరాజు నరసింహారావుగారికేసి, పానుగంటి సుబ్బారావుగారికేసి తామూ సాకూతంగా చూశారు, బదులుగా.
వంగూరి సుబ్బారావుగారి చేతిలోనే వున్న పానుగంటివారి సారంగధర నాటకంలో, యిద్దరు పరిచారికలు మాట్టాడుకుంటారొకచోట.
ఆ ఘట్టం తీసిచూపించి "ఈ ఘట్టం స్పుటంగా చదవండి మీరు" అని కోరాన్నేను సుబ్బారావుగారిని.
"ఏం, చదవక?" అంటూనే అని చదివారు వారు.
“వాటి అర్థమూ భావమూ కూడా సెలవిప్పించండి" అని కోరాన్నేను.
కాని, పక్కకిచూస్తూ వూరుకున్నారు వారు మాట్టాడలేదు.
"సెలవిప్పించండి" అని మళ్ళీ కోరాన్నేను.
అయినా మాట్టాడలేదు వారు.
ఇలాగ, నేను, మళ్ళీ మళ్ళీ కోరడమూ, అయినా తటపటాయిస్తూ వా రూరుకోడమూ—ఇదేమిటో అవగాహన కాక, “ఏమిటామాట?”లనడుగుతూ పానుగంటి సుబ్బారావుగారూ, ద్రోణంరాజు నరసింహారావుగారూ కూడా, పర్యాయత్వేనా ఆ పుస్తకం అందుకుని ఆ ఘట్టం చదువుకున్నారు; కాని వారున్నూ వూరుకున్నారు, పలక్కుండా.
అప్పుడన్నాన్నేను, వంగూరి సుబ్బారావుగారితో “నా రచనపేరు ఆక్షేపించినవారు మీ గురువుగారని మీరే చెప్పారిప్పుడు. అది మీకు స్వయంభువుకాదు. అది అనువదిస్తున్నారంతే, మీరు. ఇక్కడా అదే మార్గం. ఈ మాటలకు అర్థమూ చెప్పవద్దు మీరు, భావమూ చెప్పవద్దు, స్వతంత్రించి. మీ గురువుగారినే చెప్పమనండి. వాటిమీద వారు చెప్పిందిన్నీ అనువదిస్తూనే వుండండి మీరు" అని.
"అయితే, పానుగంటివారి రచన కంతకీ యిదేనా విచారణ చెయ్యవలసిన ఘట్టం?" అనడిగారు వంగూరు సుబ్బారావుగారు, కొంచెం దురుసుగా.
“కాదనో అవుననో మీరే నిర్ధారణ చెయ్యండి. మీ నిర్ధారణ క్కారణాలేమిటో అదిన్నీ చెప్పండి. అయితే, ఈ మాటలు " మీ గురువుగారు ఉద్దేశపూర్వకంగా రాసివుంటారో, పొరపాటున రాసివుంటారో అది కూడా మీరే సెలవివ్వండి" అని మాత్రమే కోరాన్నేను, దానిమీద.
అప్పుడు కలగజేసుకున్నారు ద్రోణంరాజు నరసింహారావుగారూ, పానుగంటి సుబ్బారావుగారూను.
మమ్మల్నిద్దరినీ వూరుకోమన్నారు వారు.
"మా ప్రూపులపని నిలిచిపోయిం”దని చెబుతూ “వెళ్ళిపోండి" అని కూడా ఆదేశించారు వారు, మమ్మల్నిద్దరినీ.
పానుగంటివారి రచనలు చాలా చదివాన్నేను.
కనబడితే, యిప్పటికీ చదువుతూనే వుంటాను కూడా.
ఒక విధంగా చూస్తే, చెప్పుకుని మనజాతి గర్వించుకోతగ్గ రచనలు వారివి.
మన హాస్యరచయితల్లోకూడా వా రొకరు.
ప్రముఖులున్ను.
558
శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి.