Jump to content

పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/574

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాని, “నన్ను లక్ష్మణరావుగారు పంపా"రని రాజాగారితో చెప్పుకోడానికి అవకాశం కనపడలేదు నాకు లక్ష్మణరావుగారి మాటలో.

కనక, వెళ్ళడమా మానడమా?

ఈ విచికిత్సతో వూరుకున్నా న్నేను.

"వెళ్ళిరండి" అని మళ్ళీ అన్నారు లక్ష్మణరావుగారు.

విసుగ్గా కాదు, బహూ సౌమ్యంగా అన్నారు వారామాట.

వెంటనే బయలుదేరాన్నేను.

"ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు, రాజుగా రనుసరించడాని కేదయినా వొక పథకం తయారుచేసే వున్నారేమో లక్ష్మణరావుగారు" అనిపించింది నాకు, వారు మళ్ళీ ఆ మాట రెట్టించడంతో.

కాక,-

"ప్రాప్తవ్యమర్థం లభతే మనుష్యః”

ఎవడి కెక్కడ ఎంత ప్రాప్తం వుందో అంతా చేతికి వచ్చే స్తుంది.

దానికి విఘాతం వుండదు.

నా నమ్మకం చిన్నప్పణ్ణుంచీ యిది.

నేను వెళ్ళాటప్పటికి రాజాగారింట్లోనే వున్నారు.

నేను చీటీ పంపించాను.

వారు దర్శనం యిచ్చారు.

పుస్తకం వారి కందించా న్నేను.

తరవాత నా పరిస్థితులు చెప్పుకున్నాను.

ప్రెస్సు బిల్లు సంగతి కూడా చెప్పాను.

"మీ విషయం - మీ వీరపూజ విషయం యిదివరకే చెప్పి వున్నారు లక్ష్మణరావుగారు" అన్నారు రాజాగారు.

చకితుణ్ణయిపోయా న్నేను, మళ్ళీ.

నా విషయం నేను లక్ష్మణరావుగారికే చెప్పించుకో వలసి వున్న స్థితిలో, లక్ష్మణరావుగారు, నా విషయమై తామే రాజాగారితో చెప్పడమా?

సంభవమేనా యిది?

మొదటిమాటు — క్షణంకిందట - కొద్ది నిమిషాల సేపు మాత్రమే లక్ష్మణరావుగారితో మాట్టాడివున్నా నేనిది నమ్మ గలనా?

అడిగితే - దేహీ అంటే, యివ్వకుండా చేసేవారుంటారు లోకంలో.

ఉంటారేమిటి మళ్ళీ, ఉన్నారు.

బహువచనం మీదే వున్నారు, మహోదారులయిన ఆ దాతల రక్తం తామే పీల్చేస్తూ.

ఈ "పడగొట్టడం" అన్నది పిఠాపురంలో నా కనుభూత పూర్వమున్ను.

“చి-త్తం” అని మాత్రమే అనగలిగా న్నేను, మాటరాక.

పర్సే పైకి తీశారు, రాజాగారీ లోపున.

550

శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి.