Jump to content

పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/563

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కాని, "ఉచితం" అని వుంది ఇంగ్లీషులో, సంతకం పైని.

"ఆ మొత్తం ప్రతిఫలం కాదు” అన్నారు వారు, నా వాలకం గుర్తించారో యేమిటో వారు.

"మీకు సాహాయ్యంగా యిచ్చానని, యిప్పటికి" అని కూడా అన్నారు, స్పష్టంగా.

నాకు చాలా ఆనందం కలిగింది.

మద్రాసులో నెలరోజులు గడిచిపోతాయి నా కా డబ్బుతో.

కళ్ళుమూసుకున్నా గడిచిపోతాయి.

ఈ పునాదిమీద - దీంతో గడిచిపోయే రోజుల్లో మరి కొంత సంపాదించుకోవచ్చు.

చేసిన పనికి ప్రతిఫలం కాదిది, ఆ బాపతు ఎంతో మరి కొంత కూడా వుంటుంది.

పైగా “యిప్పటికి” అన్నారువారు, మరొకప్పుడు కూడా చేస్తారన్నమాట, యిలాంటి సాయం వారు.

ఎంతో ధైర్యమున్నూ కలిగింది నాకు.

రెక్కలమీద బతికేవాళ్ళ కిలాంటి ధైర్యమే జీవగర్ర.

కోటీశ్వరులకూ వుంటుంది ధైర్యం, యిలాంటిది మాత్రం కాదది.

ఇంత గంభీరమూ కాదది, యింత రసవంతమూ కాదు.

ఇంత ఉన్నతమూ కాదది, నిష్కలుషమూ కాదు.

ఇంత హార్దికమూ కాదది, యింత పవిత్రమూ కాదు.

దానిచుట్టూ యెన్నో అనుమానాలు, దీనిచుట్టూ మాత్రం నిశ్చింత.

ఇలాంటి యెన్నో సన్నివేశాలవల్ల పేదలబతుకెంతో సరళంగా నడుస్తుంది.

సాదలబతుక్కి మాత్రం మాటమాటకీ అనుమానాలే - క్షణక్షణాన కల్పనలే - నిమిషనిమిషానా కుట్రలే - అడుగడుగునా ద్రోహా లే - ఎటుచూసినా అపాయాలే.

నేనేమీ మాట్టాడకపోడం - మాట్టాడలేకపోడం చూసి శాస్త్రిగారే అడిగారు మళ్ళీ "మీకు డబ్బు కావాలా, మేము ప్రకటించిన పుస్తకాలు కావాలా?" అని.

ఇది కూడా చకితుణ్ణి చేసింది నన్ను.

వ్యాపారరీత్యా చూసుకుంటే పుస్తకాలివ్వడమే సుళువూ, లాభమూ కావచ్చు వారికి, కాని, యిలా అడగడంలో యిదేనా వారి ఉద్దేశం?

ఇదమిత్థం అని నిర్ధారణ చెయ్యలేన్నేను, కాదేమో అనిపించింది.

చదువుకుందా మంటే పుస్తకాలులేని స్థితి అప్పటికే నాది.

తెనుగంటే అంత అభిమానమేకాని - నన్నయభట్టన్నా అంతంత భక్త్యాదరాలున్నే కాని- తెనుగు భారతమే లేదు నా దగ్గిర, అప్పటికీ పూర్తిగా.

ఏమయినా, ఆలోచన రేపింది, నాకీమాట.

“ఎంత యిమ్మంటారు ప్రతిఫలం?” అని వా రడిగివుంటే, డబ్బే అడిగివుందును నే నప్పటి పరిస్థితులను బట్టి.

ఇటు, కాలక్షేపానికే అవసరం అయేటట్టుండడం కాక, అటు వీరపూజ అచ్చవుతోంది, బిల్లుమీద పడిపోతోంది, పెద్ద పర్వతంలాగ.

అనుభవాలూ - జ్ఞాపకాలూను - 3

539