Jump to content

పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/557

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బెజవాడలో నన్నొక ప్రశ్న వేశారు దంటు సుబ్బావధానులు గారు "ఇది చదివే అంగీకరించారా నాగేశ్వరరావుగా రచ్చు వేయించడానికి?" అని.

అదేమిటో నే నప్పుడాలోచించలేదు.

నాగేశ్వరరావుగారి యీ ధోరణి చూశాక మాత్రం "ఏం జరుగుతుందో చివరికి?" అన్న అనుమానం కూడా పట్టుకుంది.

కాని, ఏమయినా సంతోషమే అనుకున్నాను.

"ఇక దేనికీ అంగీకరించకూడ" దనిన్నీ అనుకున్నాను, దృఢంగా.

ఏమంటే?

నా ఆక్షేపణ లింకా కొన్ని ముందు ముందున్నాయి.

ఆ రెండు మూడు చోట్లా నేను చేసిన ఆక్షేపణలు నభూతాలు.

గొప్ప ఆక్షేపణ లవి నా దృష్టిలో.

కావూ, శుద్ధ అవివేకి నయిపోతాన్నేను.

ఇందులో ఏది తేలినా నాకు సంతోషమే.

"కనక, మరొక ప్రయత్నం చేసుకుందాం అప్పుడు" అని స్థిరపరుచుకున్నాను.

పోతే, రెండు ప్రశ్నలు తోస్తా యీ సందర్భంలో కొందరికయినా.

"మద్రాసులో యెలా జరుగుతోంది కాలక్షేపం?” అనీ.

“పెట్టె అడుగున పడేసిన పొట్టం అలాగే వుందా, ఖర్చయిపోయిందా?" అనిన్ని.

నావంటి వాళ్ళకే తోచే ప్రశ్న లివి, ధనికులక్కాదు.

కాని, ధనికత్వమూ, నిర్దనికత్వమూ - ఇవికావు, జీవితాలకు విలవలు తెచ్చేవి.

ఏమి తిన్నా గడిచిపోతుంది, దినం.

ఎక్కడ వున్నా గడిచిపోతుంది జీవితం.


ఒక విధంగా మనిషికివి యెంత ప్రధానాలో, మరో విధంగా అంత అప్రధానాలివి.

ఇవి దర్జాగా వుంటే పొంగిపోవడమూ, హీనంగా వుంటే కుంగిపోడమూ - పామరుల లక్షణాలు.

అనేకమంది మహాకవులు చెప్పారిది, అనుభవంలో కూడా పరమ సత్యంగానే కనపడుతోంది, నాకు.

కనక, ఇవి వివరించడం ధర్మమే అనిపిస్తోంది.

కాక, - ఇంతవరకూ వివరించిన నా అనుభవాలకు వేటికీ తీసిపోవు కూడా యివి.

ఈ కారణంగా, నన్ను బాగా కనిపెట్టిన మరికొందరు పెద్ద మనుష్యులను స్మరించుకోడం కూడా నా విధి.

వీటిలో రెండోది - పాట్టం మాట చెప్పవలసిం దేమంత లేదు.

వీర పూజ ప్రకటన పూర్తి అయి - బిల్లు చెల్లించడం కూడా కూడా అయిపోయి - నాలుగయిదు మాసాలకు పుస్తకాలన్నీ యింటికి పట్టుకు వెళ్ళిపోయాకగూడా నా పెట్టెలోనే వుంది, మరికొంత కాలం అది.

ఖర్చుమాత్రం అయిపోయింది, చివరి కెందుకో.

అనుభవాలూ - జ్ఞాపకాలూను - 3

533