Jump to content

పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/556

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అంచేతనే గ్రంథరచన చేస్తున్నా న్నేను, వినోదం కోసం కాదు.

"మీ రాత దిద్దవలసింది కాదు. సరిగా రాశారు మీరు. ఉన్నదున్నట్టు బయటికి రావలసిన గ్రంథం మీది. నే నిలా చెప్పానని చెప్పండి నాగేశ్వరరావుగారితో" అని చెప్పి పంపేశారు వారు, నన్ను.

అయినా, లాభం లేకపోయింది.

“సవరించవలసిందే” అనేశారు వారు, నిక్కచ్చిగా.

చూసి చూసి "అయితే, టైపు కలిపించెయ్యండి. నా గ్రంథం మరొకరి సాయంతో బయటికి రావలసి వున్నట్టుంది. శ్రమ యిచ్చినందుకు మన్నించి, నాకు సెల విప్పించండి" అని కోరాను చివరికి వారి న్నేను.

"మీ యిష్టం” అన్నారు పంతులుగారు.

"అయితే - " అన్నా రంతలో.

“చాణక్య ప్రభుతులగు నప్పటి రాజ్య తంత్రజ్ఞుల దృష్టిలో - అన్న మాటలతో మీ వాక్యం ప్రారంభించడం మీ కిష్టమా?" అనడిగారు.

"చర్చవ"ద్దన్నారు, "ఇష్టమా, అనిష్టనూ?” ఇంతే చెప్పండి. అని స్పష్టంగా చెప్పారు వారు.

మళ్ళీ భానుమూర్తిగారి దగ్గరికి వెళ్ళాను.

మళ్ళీ మళ్ళీ విన్నారు, మళ్ళీ మళ్ళీ ఆలోచించారు.

"అంటే చాణక్యుడు మొదలైనవారు, వెనకటి రాజతంత్రంలో సవరణలు చేశారని, అర్థం నాగేశ్వరరావుగారి సవరణకు, మీరు చేశారని కాదు, ఆ సవరణలు. 'లోకం, అని అంగీకరించింది - లేదు-' అని కూడా కాదు. మీ నమ్మకానికీ, మీ వ్యాఖ్యానానికీ భంగం రాలేదు" అని వివరణ చేసి, మళ్ళీ ఆలోచించి “నందోరాజా భవిష్యతి. ఈ కూర్పిలా కానివ్వండి పోనీ" అని సలహా చెప్పి పంపేశారు వారు నన్ను.

"మీ కింకా కొన్ని అడ్డంకులు వస్తాయని తోస్తోంది, అప్పటి మాట చూసుకుందాం, ఇప్పటికి - ఇక్కడ - యిలా కానివ్వండి" అని కూడా చెప్పారు వారు.

అంతకంటే మరి వుపాయం లేకపోయింది నాకు.

మళ్ళీ పని ప్రారంభం అయింది.

ఈ సంగతి చెప్పగా "రాజనీతి కార్యహాని కంగీకరించదు. నిజంగా, మీరన్నట్టు, 'రాజనీతి ప్రవృత్తి యిట్టిదని నిర్వచించుటకు-' వలనే పడదు. అడుగు ముందుకి పడిందా, మీకు విజయమే. వంతులుగా రిది గుర్తించలేకపోయారు" అని వ్యాఖ్యానం చేశారు, భానుమూర్తి పంతులుగారు, జరిగింది విని.

27

వీరపూజ మొదటిఫారం అచ్చయేటప్పటికి ఖరాగా రెండు మాసాలయింది నేను మద్రాసు ప్రవేశించి.

"గ్రంథం పూర్తికావడాని కెన్ని మాసాలు పడుతుందో” అని సందేహం పట్టుకుంది నాకు, కొత్తది.

532

శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి.