23
వీరపూజ పూర్తిగా వినడానికీ, దాని మంచి చెడ్డలు నిష్కర్షగా నిర్ధారణ చెయ్యడానికీ అయిదురాత్రులు పట్టింది భానుమూర్తి పంతులుగారికి.
ఇందుకు, తనబాధ్యత కాపాడుకోడంతోపాటు, నాగేశ్వరరావుగారి క్షేమం ఆలోచించడం కూడా అగత్యం అయింది వారికి.
నిశ్చలంగా ఆలోచించారు, వారు.
నిర్మోహమాటంగా తమ సలహా అందించారు నాకు.
మనస్ఫూర్తిగా నా అభ్యుదయమున్నూ కోరారు వారు.
అయిదోనాటి రాత్రి భోజనాని కాపేశారు, నన్ను.
ఇద్దరమూ తాంబూల చర్వణం ప్రారంభించాం భోజనానంతరం.
వీరపూజ సంగతి యెత్తుకున్నారు, వారు, అవ్యవధానంగా.
“నాగేశ్వరరావుగారి భయం సహేతుకమే. రోజులలా వున్నాయి, మరి వస్తుతః, వీరపూజ విలవ కంటే ఆంధ్ర పత్రిక ప్రెస్సు విలవ చాలా హెచ్చు. న్యాయితః, నాగేశ్వరరావుగారి శ్రేయస్సుకి భంగం రాకుండేటట్టు చూడ్డం కూడా నా ధర్మం. ఈ కోణం నుంచి బాగా నిశితంగా పరిశీలించాను మీ రచన నేను, మీ రచనలో, పోలీసులకు పని కల్పించేది వొక్క అక్షరమైనా లేదు. సాహిత్యవేత్తలే గుర్తించవలసిన రచన మీది. చారిత్రికులే ఆలోచించవలసిన ఆక్షేపణలున్ను మీవి. చరిత్రలు రాసేవారు ఇలా నిశిత విమర్శలు చెయ్యడం చాలా అగత్యం. అంకెలూ, తేదీలూ కాదు చరిత్రలో చూడవలసినవి మీ గ్రంథం చాలా మంచిదని గాఢమైనతృప్తి కలిగింది నాకు." అన్నారు వారు, ముందు.
ఒక్క క్షణం నిదానించి “ఒక్క సలహా చెబుతాను మీకు. ముందు జాగ్రత్తకోసమే, అనుమానం వుండి కాదు” అన్నారు తరవాత.
"ఈ భాగం మాత్రమే కాదు, ఈ వీరపూజ కింకా యెన్నో రాయదలుచుకుని వున్నారు మీరు. కాలక్రమాన ఇలాంటి గ్రంథాలున్నూ మీరురాయవలసివుంది. కనక, మీ పూనిక నిరాఘాటంగా సాగడానికే నా సలహా. అది, ఈ గ్రంథం, జార్జి చక్రవర్తికి అంకితం చెయ్యడమే” అనిన్నీ చెప్పారు, చివరికి.
నాగేశ్వరరావుగారి పేర చీటీ కూడా రాసి యిచ్చారు, తరవాత వారు.
నాకూ దేశ స్వాతంత్ర్యం కావాలి, దాపరికం లే దిందులో.
అయితే, తక్కిన పనులన్నీ మానుకుని, తాదాత్మ్యంతో పని చెయ్యవలసినంత ప్రధానం మాత్రం కా దిది.
అవి సాధించడానికి ముందు చెయ్యవలసింది చాలా వుంది.
మూకతో జరిగే పని కాదుకూడా అది.
వర్ణాలు నాలుగే; కాని కులాలు లెక్కలేనన్ని మనలో.
వర్ణాల్లోనూ, కులాల్లోనూ కూడా శాఖలున్నూ యెన్నో.
వీధికివస్తే యెవడికి వాడే, యిద్దరు కలియడాని కన్నీ అడ్డంకులే అందరికీ.
అనుభవాలూ - జ్ఞాపకాలూను - 3
523