వారాలు వెళ్ళిపోయేవి.
విసిగిపోయేవాణ్ణి.
అభిమానం ముంచుకువచ్చేది.
చల్లబడిన్నీ పోయేవాణ్ణి, చివరికి.
ధనికులకు అవగాహన అయేది కాదు, నా యాతన.
కేవలం ధనికులు తీర్చగలదిన్నీ కాదు.
ఓపిక పట్టడం తప్పనిసరి అయిపోయింది, నాకు.
“ప్రాప్తవ్య మర్ధం లభతే మనుష్య”
కుమారసంభవం పూర్తి చేశాను, మేఘసందేశం ప్రారంభించాను - ఆ సందర్భంలో వొక పెద్దమనిషి చేతిలో కనపడింది, పంచతంత్రం నాకోనాడు.
అదే మొదటిమాటు నేనది చూడ్డం.
అడిగిపుచ్చుకుని, పుస్తకం తెరిచాను.
చూడగా, ఈ వాక్యమే కనపడింది మొదటి మాటు నాకు.
నాకేకాదు, మానవలోకానికంతకూ వున్న అనుభవాన్ని పట్టి పుట్టిన సిద్ధాంతం యిది.
చూశాను, నమ్మేశాను, గట్టిగా.
కనక, అప్పణ్ణుంచీ నమ్ముకునే వున్నాను కూడా యిది.
అప్పటి నా స్థితి సరిగా యిది.
ఈ స్థితిలో అంతర్నాటకాలు.
వేంకటరామా అండుకో అప్పుడప్పుడే మారాకు వేస్తోంది.
అన్నదమ్ము లిద్దరూ - వెంకటరావుగారూ, వెంకయ్యగారూ నాలాగే మరో గదిలో వుండేవా రాంధ్రపత్రిక ఆఫీసులోనే.
జిల్లా భూగోళాలవంటి చిన్న చిన్న పుస్తకా లచ్చువేయించుకుంటున్నా రక్కడ, స్వయంపాకం చేసుకుంటూ.
ఒకనాటి రాత్రి భోజనానంతరం నా గదిలోకి వచ్చారు వెంకయ్యగారు.
ఏమిటేమిటో మాట్టాడారు, చాలా సేపు.
పుస్తకాలు ప్రకటించడం అంటే, వొకరి సహాయం వల్ల అయేది కాదన్నారు.
“పాతిక రూపాయలిస్తాం, వీరపూజ మాకిచ్చేసి వెళ్ళిపొండి" అన్నారు, చివరికి.
పుస్తకాల వ్యాపారమే కాదు, ఏ వ్యాపారమూ సాగదు, పెట్టుబడి చేతిలో లేనిదే.
నాకున్నూ బాగా తెలిసిందే యిది.
తగిన ప్రతిఫలం యిచ్చేవారు లేకే నేను సొంతంగా పుస్తకాలు ప్రకటించుకోడం.
తగిన ప్రతిఫలం అంటే పాతికరూపాయ లొక ప్రతిఫలమేనా?
నాలుగు మాసాలు పట్టింది. వీరపూజ పూర్తి చెయ్యడానికి.
ఆ రోజుల్లో నయినా పాతిక రూపాయలు సరిపోతాయా, నాలుగు మాసాలు కూచుని తినడానికి?
516
శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి.