నేనూ వొక అర్థినే. నేనూ తక్కిన వారిలాగే ప్రయత్నించనా, కనీసం డబ్బయినా పట్టుకుపోడానికి?
కాని, అలా మాట్టాడం నా కిష్టంలేదు.
అలాగ డబ్బులాగడం నాకు చేతాకాదు.
ఇంతకీ,-
వీరపూజ విషయం నేను బలవంతం చేసింది కాదు.
పంతులుగారే వాగ్దానం చేశారు అవ్యవధానంగా, నా స్థితి నేను చెప్పుకోను.
"మీ రచ్చు వేయించతగ్గ గ్రంథం వీరపూజ, మీరు సాయం చెయ్యవలసినవాడు సుబ్రహ్మణ్యశాస్త్రి" అని చెప్పాడే గాని, శ్రీరామశాస్త్రి అయినా నిక్కచ్చి చెయ్యలేదు, పంతులు గారిని.
అయినా, మళ్ళీ మళ్ళీ అడిగితే యేమిటో, అడక్కపోతే యేమిటో?
శ్రీరామశాస్త్రి, పొక్తుపరిచిన వ్యవహారం నాకు నేనే పొడుచేసుకుంటానేమో?
"మీరూ విసిగిపోవద్దు. పంతులుగారినీ విసిగించావద్దు" అని సలహా చెప్పారు, కర్రా లక్ష్మీనరసింహంగారు, నా ఆందోళన చూసి.
"పంతులుగారికే కాదు, ఆంధ్రదేశానికే సర్వాధారం అమృతాంజనం. ఆంధ్రపత్రికా అలాంటిదే అచ్చంగా. అయితే ఆంధ్ర పత్రిక బతుకు అమృతాంజనం గుప్పిట వుంది. ఆంధ్రులు కాదు, దానిని నిలవబెడుతున్నది. కనక, మీ పనిక్కంటే మీకూ, మా పనిక్కంటే మాకూ గూడా ఆ రెండూ ప్రధానాలు. వంతులుగారి స్వస్వరూపం అవగాహ అయిందా? మీరు కొత్తవారు. సాహసించి, ముందుకి చొరుచుకుపోయే స్వభావం కానట్టుంది, మీది. ఊపిరాడకుండా పాతవా రెప్పుడూ చుట్టుకుని వుంటారు పంతులుగారి నెప్పుడూ, పంతులుగారు చెప్పింది చేసే వారికంటే, యేదో విధంగా వారి నిరుకున పెట్టి డబ్బు నొల్లుకుపోయేవారే యెక్కువ, వారిలో. అదొక పద్మవ్యూహం. భేదించుకుని బయటపడలేరు పంతులుగారు. అంచేత, కొత్తవారి పని కొంత ఆలస్యం కావచ్చు. అవుతుంది కూడా తప్పదు. అయినా, వోపిక పట్టడమే నా సలహా మీకు" అనిన్నీ చాలా గట్టిగా చెప్పారు వారు.
పైగా, - పంతులుగారు వేసుకున్న పథకం పక్వానికి వచ్చిందా, యింకా వూహలోనే వుందా?
పూర్తిగా కొత్తవాణ్ణి, నాతోనే అది ప్రారంభం కావడం సంభవమా?
శ్రీరామశాస్త్రి, మళ్ళీ ప్రయత్నం చెయ్యవలసి వుంటుందా?
ఇలా కూడా చర్చించుకున్నా న్నేను.
కాక, - చేసేది మాత్రం యేమివుందీ?
తలో అయిదూ తలో పదీ యిచ్చి మూడువందలు నాకు కూర్చిపెట్టలేని మా ప్రాంతంవా రటూ, ఏదో వొకటి, అందరికీ యిస్తూవుండడమే చేతనయిన పంతులుగా రిటూను.
వారి వాగ్దాన విషయమై నిరాశ చేసుకుంటే, మరి గతి?
కేవలమూ అదృష్టం నమ్ముకుని వుండిపోయా న్నేను.
దినాలుగడిచేవి.
అనుభవాలూ - జ్ఞాపకాలూను - 3
515