చెబుతూ చెబుతూనే నిదానంగా చూశారు, నాకేసి.
“మీరు వేదం చెప్పుకున్నారా?” అనడిగా రాయన.
"కొంచెం చెప్పుకున్నాను”
"అయితే, మీ వేషం యిది కాదు, మొదణ్ణుంచీ”
"నిజమే, కాదు”
"ఏడెనిమిదేళ్ళక్రితం యేలూరు వచ్చారు మీ రొకమాటు”
"అవును, వచ్చాను"
"అప్పుడు మీ గురువుగారూ మీరూ మా యింటోనే బస చేశారు"
"అయితే, మీ యింటిపేరు పిశుపాటివారా?” అనడిగాన్నేను.
“అవు"నన్నా రాయన.
దీంతో, ఆ యేలూరి వృత్తాంతం అంతా నెమరుకి వచ్చింది, నాకు.
మా గురువులు ప్రవాపర్వతావధానులు గారంటే ఆయన తండ్రి కెంతో భక్తి.
దసరాలో, వేదవేత్తలను మూడురోజులూ మృష్టాన్నతృప్తులను చేసి, సత్కరించేవారు కూడా ఆయన.
నేను రెండు ప్రశ్నలు చెప్పాను వారికి, రెండూ నేను చెప్పినట్టే జరిగాయి.
తన పేరు “సత్యనారాయణ" అంటూ, ఆ గుమాస్తా, ఆ ప్రశ్నల సంగతిన్నీ జ్ఞాపకం చేశారు.
ఈ విధంగా, కర్రా లక్ష్మీనరసింహంగారూ, పిశుపాటి సత్యనారాయణగారూ నాకు బాగా సన్నిహితులయినారు, నేను మద్రాసు ప్రవేశించిన్నాడే, ఆంధ్రపత్రిక ఆఫీసులోనే.
మద్రాసు అంటే యేదో దూరదేశం అన్న భయం పోయింది, నాకు.
20
తొలినాటి ఉదయం పది దాటాక వచ్చాను, సెంట్రల్ స్టేషన్నుంచి ఆంధ్రపత్రిక ఆఫీసుకు.
ట్రాములు, జట్కాలు, గుర్రబ్బళ్ళు, వొంటెద్దుబళ్ళు, లాగుడు బళ్ళు, రిక్షాలు, మోటార్లు, సైకిళ్ళు, మోటారు సైకిళ్ళు - వాటి మధ్య జనుల రాకపోకలు - బహూ సమ్మర్ధంగా వుంది, రోడ్డంతా.
ఆ సమ్మర్థం తంబుచెట్టివీధిదాకా వొక్కలాగే వుంది.
అంత వెడల్పాటి వీధులూ, అన్ని యాన సాధనాలూ, అంత సమ్మర్దమూ అక్కడే చూడ్డం నేను, మొదటి మాటు.
కొత్తమనిషి - ముఖ్యంగా పల్లెటూరినుంచి మొదటి మాటు వెళ్ళినవాడు, నిరపాయంగా నడిచి వెళ్ళడం చాలా కష్టం అక్కడ.
అంచేత, ఆ బజారూ, ఆఫీసులూ తెరవకముందా చైనా బజారు - ఇప్పుడు సుభాసురోడ్డు ఎలావుంటుందో చూడాలనిపించింది.
వెంటనే బయలుదేరాను సెంట్రల్ వైపు, ఉదయం యేడు దాటాక.
అటే బయలుదేరడాని కొకటే కారణం.
అనుభవాలూ - జ్ఞాపకాలూను - 3
511