Jump to content

పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చాలదంటుంది. మా తమ్ముడికి మావాడి కివ్వాలనే వుంది, మా మరదలే మెలిక వేస్తోంది. చూస్తూ వూరుకుంటారా మీరు? ముగ్గురు కొడుకుల్లోనూ వొక్కడికయినా నేను మేనరికం చేసుకోవద్దూ? పోనీ అంటే మా చిన్న తమ్ముడి కిప్పటికిన్నీ సంతానం లేకపోయింది గదా, నాకిక పుట్టిల్లు దూరం కావలసిందేనా?” అంటూ అడగసాగారు మా అమ్మగారు.

ఉత్తరక్షణంలో వూరందరూ మా అమ్మగారి పక్షమే అవలంబించేశారు.

"లేనిపోని వంకలు పన్నకు, మహాలక్ష్మీ సోదెమ్మ యింటికి పెద్దాడబడుచు. నువ్వు కోరవలసింది పోయి, అదే కోరి నీ కూతుర్ని చేసుకుంటానంటోంది. కాదనడం సుతరామూ జయకరం కాదు నీ"కంటూ బ్రాహ్మణస్త్రీలే కాక, కమ్మ స్త్రీలున్నూ మా మేనత్తను దుయ్యబట్టసాగారు.

“సిద్ధాంతిగారి సంబంధం తపస్సు చేసి సంపాదించాడు మీ నాయన. అనుబంధం తెగిపోనివ్వకు" అంటూ పురుషులున్నూ మా మేనమామగారిని హెచ్చరించారు. గట్టిగా.

పీసపాటి వెంకప్ప సర్వతోముఖ సోమయాజులుగారని ఆ వూళ్ళో వొక బ్రహ్మణ్యులు.

సర్వతోముఖం దాకా క్రతువులు చేసివున్న కర్మిష్ఠి ఆయన.

విశేషించి మా పింతల్లుల్లో చివరి ఆమె మామగారున్ను.

మీనయ్యగారి అల్లుళ్ళందరిలోనూ మా నాయనగారిమీద, తమ కుమారునిమీద కంటే ఎక్కువ వాత్సల్యం ఆయనకు.

విద్యలకు సంబంధించి యేర్పడ్డ పరమాదరభావం దానికి ముఖ్యహేతువు.

నేను ముక్కామల వెళ్ళినప్పుడల్లా, దినమ్మూ నేను వారి దర్శనానికి వెళ్ళకుండానూ వుండేవాణ్ణి కాదు, వెళ్ళినప్పుడల్లా నన్ను దగ్గిర కూచోబెట్టుకుని నాచేత సామాలు చెప్పించకుండా వుండేవారు కారున్నూ ఆయన.

నామీది ఆ వాత్సల్యంతో ఆయన, స్వయంగా మా పెద్దమేనమామగారి యింటికి వచ్చి “రామకృష్ణమ్మా, ఆలోచన యింకా తెగలేదూ? ఇలాంటి అల్లుణ్ణి సంపాదించగలవా నువ్వు?" అంటూ తొందరపెట్టారు.

ఇక మాట్టాడ్డం యెలాగ?

విధిలేక మా మేనత్తగారు "మీ యిష్టం, నేనేమి చెప్పగలనూ?” అన్నారు భర్తతో.

“నా కూతురు నీ కోడలే అని మొదణ్ణుంచీ నీ నిశ్చయమే కదా, యింకేం, ముహూర్తం స్థిరపరిపించు" అనేశారు మామామగారు, అవ్యవధానంగా.

ఉత్తరక్షణంలో పొలమూరు వచ్చేశాం మేము.

ముహూర్త నిశ్చయంకోసం మా మామగారున్నూ మాతో వచ్చారు.

అంతవరకూ "యిదేలా జరుగుతుందీ?" అని యెంతో ఆదుర్దాగా వుండిన మా నాయనగారు మూడు నిమిషాల్లో ముహూర్తం పెట్టేశారు.

వివాహమున్నూ సలక్షణంగా జరిగిపోయింది, వెంటనే

ఇంతకీ : - మనలో మనమాట, నిజం చెప్పవద్దూ?

అనుభవాలూ - జ్ఞాపకాలూను - 1

29