Jump to content

పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/525

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కాల క్రమాన మద్రాసు పాత దయిపోయింది నాకు, దైవ వశాన రెయిలు పడిపోడం మాత్రం పాతది కాలేదు నాకక్కడ, యెప్పుడూ.

మరికొంతసేపటి తండియార్పేటా, దాంతో పాటు వావిళ్ళ వారి పేరూ జ్ఞాపకమూ వచ్చింది.

"వారిది మద్రాసు కాదూ?" అనుకున్నా నాలో నేను.

మాట పైకి వచ్చినట్టుంది "తండియార్పేటు మద్రాసులో వొకపీట" అన్నాడు పక్కని వున్న బాటసారి.

ఏమిటేమిటో చెప్పడం మొదలు పెట్టాడు, దానిమీద మిత్రుడు.

గుక్క తిప్పుకోకుండా చెప్పాడు, చాలా సంగతులు.

ఒక్కటీ బుర్రకెక్కలేదు నాకు, మద్రాసు పరిచయం లేక.

చెప్పి చెప్పి పరుపు కట్టేసుకున్నాడు.

పెట్టె కూడా సద్దుకున్నాడు, నా పుస్తకం నా కిచ్చి.

ఆ సద్దుకోడంలో చిన్న చిన్న వస్తువులెన్నో పెట్టుకున్నాడు బల్లమీద.

వాటిలో మూడు ఫౌంటెన్ కలాలున్నాయి, రంగురంగులవీ, రకరకాలవీని.

అది వొక్కటీ లేనివాణ్ణి నేను. "ఈయనకు మూడెందుకూ?" అనుకున్నాను.

అనుకున్నా నంటే మనసులో అనుకున్నాను, ఇందాకటిలా కాక, బాగా జాగ్రత్తపడి.

కాని వాటిలో వొకటి యెత్తి పట్టుకున్నా డాయన, నా కేసి చూస్తూ.

“ఇప్పటిదాకా మీ రచన చదివాను. అది అర్థం చేసుకోడానికి తగినంత పరిజ్ఞానం లేదు నాకు. కాని వొకటి తోచింది. సరదాక్కొన్నానీ కలాలు మూడు, నా కొక్కటే చాలు, అసలు. చూడగా, మీ జేబులో కలం వున్నట్టు లేదు. మీరు కవులుకనక, మీ కిలాంటిది చాలా అగత్యం. ఇది మీ కిద్దామని బుద్ధి పుట్టింది నాకు. నేను భాగ్యవంతుణ్ణనుకుంటూ యివ్వడం లేదు మీకిది. తప్పు కాకపోతే పుచ్చుకోండి. ఉపయోగించండి" అన్నా డాయన.

“శిలాభోగం అనీ, స్థలాభోగం అనీ అంటారు మనవాళ్ళు, అలాగే యిది కలం భోగం కావచ్చు. కవిచేతిలో నలిగే అదృష్టం వుంది దీనికి అనిన్నీ చెబుతూ చేతికందించా డది ఆయన. "

అడిగే పుచ్చుకునే పద్దతి నాది యేమయినా, కనక, పుచ్చుకోడం తప్పనుకోడం యేమిటీ నేను?

నటనమాత్రం యెందుకూ, నేనేదో మహా “మహారాజశ్రీ" నయి వున్నట్టు?

నిరభ్యంతరంగా పుచ్చుకున్నాన్నేను.

ప్రీతిగా–ఉల్లాసంగా—సంతోషంగా పుచ్చుకున్నాను.

ఆశీర్వచనమున్నూ చేశాను.

ఇప్పటికీ నేను చూపించగల కృతజ్ఞత అంతే యెవరికయినా.

బ్లాకుబర్డు కలం అది.

పేరికి తగ్గట్టే, నల్లగా - నున్నగా - ముద్దుగా వుందది.

చాలా పేరుపడ్డ కలం అది ఆ రోజుల్లో.

అనుభవాలూ - జ్ఞాపకాలూను - 3

501