ఆలోచనకోసం గుచ్చేసుకున్న కళ్ళలో అంధకారం కమ్ముకుంది.
దాని వెనకనే, దానికి జాతీయమైన నిద్రకూడా ఆవరించింది, వచ్చి.
మళ్ళీ కళ్ళు తెరిచేటప్పటికి అటు సూర్యోదయం అవుతోంది, యిటు గూడూరు ప్లాటుఫారం మీద నిలిచివుంది, మెయిలు.
నేను కొళాయి దగ్గిరికి వెళ్ళి వచ్చాటప్పటికి మరో నలుగురైదుగురెక్కారు కొత్తగా మా కంపార్టుమెంటులో.
ఉండుండి, యేదో స్ఫురించిన ట్టులిక్కి పడి "అయితేనూ, మీరెందుకు వెడుతున్నారూ మద్రాసు?” అనడిగాడు మిత్రుడు.
నేను చెప్పాను.
“పుస్తకం వొకమాటు చూడనిస్తారా?” అనడిగా డాయన.
ఇవ్వగా, చదవడం ప్రారంభించాడు.
రెయిలు పరుగెత్తింది, మళ్ళీ ఆగింది.
సుళ్ళూరుపేట స్టేషను, అది.
కృష్ణాజిల్లా యాసా, గుంటూరుజిల్లా యాసా, నెల్లూరు జిల్లా యాసా పోయి, అరవతెనుగు ప్రారంభం అయిందక్కడ, స్పష్టంగా.
డజన్లకొద్దీ అరవపాలరును చూడ్డమున్నూ అక్కడే ప్రారంభం అయింది.
గూడకట్లు పైకి విరిచి కట్టుకోడం - జుట్టుకొప్పులు పెట్టుకోడం - పొగాకు నమలడం - కింది పెదవులు పైకెత్తుకుని మాట్లాడ్డం - చాలా వింతగా కనపడ్డా యవి.
అప్పటివరకూ, అప్పుడూ అప్పుడూ పద్యాలు కడుతూనే వున్నాను, కనక, వొకపద్యం వచ్చేసింది దానికదే, అప్రయత్నంగా,—
గీ॥ ప్రస్తుతింపనొ? మూడు రూపాయలసర
కాన్క చెల్లింపలేదొ? యీ కిన్కయేల?
తెచ్చి విడిచితె కన్మూసి తెరచునంత
మొగ మెరుంగని యీ అర్వమూక నడుమ?కి అని.
మెయిలుని సంబోధిస్తూ కట్టిన పద్యం యిది.
"ప్రస్తుతింపనొ" యతికోసం పడ్డ పడికట్టురాయి.
రెయిలు కంపెనీకి చెల్లించింది మూడు రూపాయల యేడణాలే, కాని, గణంకోసం మరో అణా చేర్చవలసి వచ్చింది, సేల్సుటాక్సులాగ.
"వెల్ల, చిల్క, మొల్క, అప్డు, అర్వ- ఇది ఆకృతిగణం.
పద్యం కావడం వల్ల వచ్చిన పాట్లివి."
పద్యం కావడం వల్లనే వచ్చింది ధోరణి, వచనం కోసం పుట్టనే పుట్టదీ ప్రయత్నం, మరి.
ఇంతలో యెణ్ణూరు దాటింది.
వీరపూజ చదువుతూనే "యెంచేతో రెయిలిక్కడ పడి పోతూ వుంటాయి, తరుచు" అన్నాడు మిత్రు డెంచేతో?
అది కొత్తసంగతి నాకు, మద్రాసులాగే.
500
శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి.