Jump to content

పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/522

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అని వెంకటరమణయ్య గారిని ప్రశ్నిస్తూ రెండు రూపాయలిచ్చారు నాకు.

దాంతో నిరుత్సాహపడ్డారు గాని సాహసించి, మరో యిద్దరి దగ్గరికిన్నీ తీసుకు వెళ్ళారు నన్ను, వెంకటరమణయ్యగారు.

మొత్తం వారిద్వారా పాతిక రూపాయలు చేతికి వచ్చాయి.

"నిన్నరాత్రి సూరి వారి యింటో రాతపుస్తక చదివినవారు మీరేనా?" అనడిగారు నన్నొక పెద్దమనిషి, దారిలో తారసపడి.

డాక్టరు. దంటు సుబ్బావధానిగారు వారు.

డాక్టరు. యర్రమిల్లి జగ్గన్న శాస్త్రిగారి ద్వారా వారి ప్రగతి వినివున్నా న్నేను.

నా సంగతిన్నీ కొంచెం తెలిసినట్టేవుంది, వారికిన్నీ.

మేము కలుసుకోడం మాత్రం అదే మొదటి మాటు.

భోజనం చేసి నరసింహశాస్త్రిగారు కోర్టుకి వెళ్ళిపోయారు, సుబ్బావధానులుగారు వచ్చారు.

కోరి, పృథ్వీరాజు చరిత్రా, భీమ సింహుని చరిత్రా, ప్రతాపసింహాని చరిత్రా చదివించుకుని విన్నారు వారు.

“విషయానికి తగ్గ రచన. కాలానికి తగ్గ వ్యాఖ్యానం" అని తమ అభిప్రాయాలున్నూ చెప్పారు, వారు.

వైద్యవిద్య కలకత్తాలో అభ్యసించారు వారు.

బంగాళీలతో చాలా పరిచయం వారికి చాలా మందితో.

వారి ప్రవృత్తీ, ప్రగమనశీలమూ బాగా పరిచితాలు వారికి.

"మీరు బంగాళీలయి, మీ గ్రంథం బంగాళీ భాషలో పుట్టి వుంటే, యిది యెప్పుడో అచ్చయిపోయి వుండడమే కాదు, ప్రపంచ చారిత్రికుల మన్ననలున్నూ అంది వుండే దెప్పుడో" అనిన్నీ అన్నారు వారు.

ఏంతోచిందో మరి, "ఇది చదివే అంగీకరించారా నాగేశ్వరరావుగా రచ్చు వేయించడానికి?” అనడిగారు కూడా నన్ను, గుమ్మం దిగుతూ.

అమాటా యీమాటా చెబుతూ పది అడుగులు వేశాన్నేను.

ఇంతలో అవధానులుగారి స్నేహితులెవరో యెదురైనారు మాకు.

"ఆగు" అన్నారు సుబ్బావధానులు గారు.

నా పేరు చెప్పారు ముందువారికి. నా గ్రంథం సంగతిన్నీ చెప్పారు తరవాత. “నీకు చేతనైనంత డబ్బియ్యి వారి, వెళ్ళిపో" అన్నారు చివరికి.

పర్సు తీశారు, పదిరూపాయలే వుంది అందులో.

అది నాచేతిలో పెట్టి వెళ్ళిపోయారు వారు, ముందుకి.

“సంతోషించండి” అన్నారు వెళ్ళిపోయారు అవధానులు గారున్నూ.

ఆరాత్రే మద్రాసు ప్రయాణం నేను.

స్టేషనుకు తీసుకువెళ్ళి, నన్ను వద్దని టిక్కట్టున్నూ తామే కొని, నన్ను రెయిలెక్కించి, టిక్కట్టూ కొంత డబ్బూ చేతిలో పెట్టి, శుభమున్నూ పలికి వెళ్ళిపోయారు నరసింహశాస్త్రిగారు.

498

శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి.