యిష్టపడలేక పతకం మార్చి "ఈడు తగునా వదినా?” అని మెలికవేశారు వల్లమాలిన మమత మాత్రం నటిస్తూ ఆమె.
ఈడు చాలకపోడం నిజమే, మరొకరయితే దానికి బదులు చెప్పలేకేపోదురు గాని ఆ మాట చెవినిబడాటప్పటికి పట్టరాని రోషం వచ్చేసింది మా అమ్మగారికి.
నిజానికి, మా అమ్మగారు, ఈడు చాలునా అన్నమాటలో మా మేనత్తగారికి నామీద యిష్టం లేకపోడమూ గుర్తించారు, ఆవిడ అసహాయురాలయి వుండడమూ గుర్తించేశారు.
దాంతో దిటవు తెచ్చుకుని "ఈడు చాలదూ? సంవత్సరం మీద తొమ్మిదిమాసాల వార చాలదేం పెళ్ళికి?" అంటూ నిలవతీశా రావిణ్ణి మా అమ్మగారు.
నన్నొకచేత మా సీతనొకచేతా పట్టుకుని యిరుగుపొరుగిళ్ళకు బయలుదేరారు పట్టుదలతో
చిన్నతనమే అయినా మా మేనత్తగారి మాటమీద నేనూ చాలా బాధపడిపోయాను, నవనిధులూ చెయ్యిజారి పోతూన్నట్టు.
అదేమిటో యిప్పటికీ చెప్పలేను గాని చిన్నప్పణ్ణుంచీ సీత నా సొత్తు అనే నా నిశ్చయం.
మా మేనమామగారు మా చిన్నన్నగారికి మరో సంబంధం చూసుకోమన్నప్పుడు నే నెంతో సంబరపడ్డాను గాని మా పింతల్లిగారి సంబంధం తప్పిపోయాక గూడా నా విషయం వచ్చేటప్పటికి మా మేనత్త వేసిన మెలికతో నా హృదయం కలుక్కుమంది.
ఇటీవల శాకుంతలం చదివివుండినాను కనక జననాంతర సౌహృదం అనుకో గలుగుతున్నారు గాని అప్పట్లో నాకేమి బోధపడుతుందీ అదీ?
అది యేమయినా; - వయస్సుకి సంబంధించిన పూర్వపక్షం మాట అలా వుండగా, అప్పటికి నేను పొట్టిగా కూడా వుండేవాణ్ణి బాగా.
తరువాత్తరవాత నేనింత పొడుగవుతానని అప్పుడెవరున్నూ అనుకోనేలేదు.
మా వూళ్ళో, మైలవరపు జోగమ్మగా రనే ఆవిడ, నన్ను చూసి తరుచు "అదిగో వామనావతారం వస్తోంది" అనేవారు ముద్దుగా.
నిజాని కిద్దరమూ దూరానికి సమంగా వున్నట్టే కనబడినా అప్పటికీ యిప్పటికీ గూడా మా సీతకంటే నేనే పొడుగులెండి.
కాగా, వొడ్డూ పొడుగుల వ్యత్యాసం కూడా మా అమ్మగారి కడ్డంకి కాలేకపోయింది.
కాక : - తీరా చూస్తే మా మేనత్తక్కంటే మా అమ్మగారికే ఆ వూళ్ళో ఆత్మీయ లెక్కువ.
ఇద్దరి పుట్టింటివారి వూరూ అదే అయినా, మీనయ్యగారి పెద్దకూతురు కావడంవల్లా కలిసికట్టుతనం వుండడంవల్లా మా అమ్మగా రంటేనే ఆ వూళ్ళో ఆదరాభిమానా లెక్కువ.
ఇందువల్ల కూడా ధైర్యం చిక్కబట్టుకుని ఇంటింటికీ తీసుకెళ్లి, మమ్మల్ని దగ్గిరదగ్గిరగానూ నుంచోబెట్టి "ఏమర్రా, మా మరదలు మావాడికీ దీనికీ యీడు
28
శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి - 1