Jump to content

పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/517

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కురుపాం మార్కెట్టులో జరిగిందది.

మార్కెట్టింకా ప్రారంభం కాలేదు, భవనం మాత్రం తయారయి వుంది సర్వసిద్ధంగా.

చుట్టూవున్న గదుల్లో ప్రతినిథులసభలూ, మధ్యగావున్న తెరపిలో అకాశం అంత పందిట్లో మహాసభను.

ఇక వొక్కగంటలో సభ ప్రారంభం అవుతుందనగా వెళ్ళాన్నేను, రెయిలు దిగి.

గదులన్నీ కిక్కిరిసి వున్నాయి, బస దొరకలేదు.

వసారాలో శ్రీరామశాస్త్రి కనపడ్డాడు, నా బస విషయం మాట్టాడుకుంటున్నాం.

పక్కనే వొక గదిగుమ్మాన నుంచునివున్నా రొక పెద్దమనిషి "మీ పేరెవ?"రనడిగారు వారు, నన్ను.

నేను చెప్పాను.

వెంటనే దగ్గిరికి వచ్చి, నాచెయ్యి పట్టుకుని "మేమున్న గదిలో ప్రవేశించండి" అంటూ ఆహ్వానించారు వారు నన్ను.

చకితుణ్ణయినాన్నేను, ఆ ఆదరానికి.

పొణకా పట్టాభిరామారెడ్డిగారు, మరెవరో కాదు.

అప్పుడే - అక్కడే—ఆవిధంగానే మా మొదటి పరిచయం.

లోపలికి తొంగి చూస్తినిగదా, వారి మేనల్లుడు మరపూరి పిచ్చిరెడ్డిగారూ, జమీన్‌రైతు పత్రిక సంపాదకులయివున్న నెల్లూరి వెంకట్రామా నాయుడుగారూ - యింకా మరికొందరు యువకులూ నిండివున్నారు.

నేను సందేహించాను; కాని చోటుచేసి, నన్ను తమతో చేర్చుకున్నారు, రెడ్డిగారు.

మనుమసిద్ధి సీమ కంతకూ వొక్క గునుపాటి యానాది రెడ్డి గారికి మాత్రమే నా కప్పటికి పరిచయం.

రెండోవారు పట్టాభిరామారెడ్డిగారు.

ఆంధ్రోద్యమం, గ్రంథాలయోద్యమం - ఇలాంటి ప్రజాహితోద్యమాల్లో రెడ్డి యువకులకందరికీ వొక్క పెట్టాభిరామారెడ్డి గారిది ముందంజ, అప్పట్లో.

ఆ పూట సభ పూర్తయింది.

శ్రీరామశాస్త్రిని తీసుకువెడుతూ, నన్ను కూడా తమ యింటికి భోజనానికి తీసుకువెళ్ళారు, ఆ వూరి యువక వకీలొకాయన.

భోజనంచేసి అక్కడే పడుకున్నాం కాస్సేపు, మేము.

నిద్ర రాలేదు మా కిద్దరికీ, యేమిటేమిటో సంభాషణ మాత్రం వచ్చింది.

వాటిలో వీరపూజ విషయం వొకటి.

వినివిని "మహాబాగా తెచ్చావు సమయానికీ ప్రస్తావన" అంటూ పడుకుని మాట్టాడుతున్నవా డల్లా వుబ్బెత్తుగా లేచి కూచ్చున్నాడు శ్రీరామశాస్త్రి.

"గ్రంథకర్త లెందరో తమ గ్రంథా లచ్చుకాక బాధపడుతున్నారు మనవాళ్ళు. ఆ గ్రంథాల్లో ఉద్గ్రంథాలున్నూ కొన్ని వున్నాయి. అది గుర్తించారు కాశీనాథుని నాగేశ్వరరావు పంతులుగారు. అలాంటివారికి సాయం చెయ్యాలని నిశ్చయించుకుని,

అనుభవాలూ - జ్ఞాపకాలూను - 3

493