Jump to content

పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/511

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బట్టలు కొనుక్కోడానికీ - పుస్తకాలు కొనుక్కోడానికీ - సభలకు వెళ్ళడానికి - ఇలాగ స్వార్థానికిన్ని కర్చయిందెంతో కొంత.

అంటే, మూడువందల రూపాయలు సంపాదించి గుట్టలు పెట్టడం సాధ్యంకాలేదు నాకు.

కాని, అనుకోనివిధంగా అచ్చుపడి పోయిందది.

వింత సంగతి వొక విధంగా, అది.

13

అది వివరించాలంటే కొంచెం వెనక్కి వెళ్ళాలి.

వెనకాముందుల కలయికే వర్తమానం, మరి.

పూర్వాపరసందర్భాలు కలిస్తేగాని, కథే లేదు కూడా.

వెనకటిదీ ముందటిదీ సమన్వయం చేసుకోగలిగితే గాని, అనుభవమున్నూ యేర్పడదు, అసలు.

ప్రతీ పూర్వవృత్తానికీ భవిష్యత్తులో ఒక సజాతీయ వ్యవహారం జరుగుతుందా ?

జరగావచ్చు, జరక్కాపోవచ్చు, జరిగినా అది గుర్తించా లేకపోవచ్చు, మనిషి.

కాని, యిందులో యేది లేకపోయినా, అనుభవమేకాదు, జీవితమూ లేదు.

మరి, ప్రకృతం.

రాజమహేంద్రవరంలో, కంచుమర్చివారి, రామచంద్రసిటీ (అప్పటికి, మిడిల్) హైస్కూలు భవనంలో దుగ్గిరాల సూర్యప్రకాశరావుగారి గోదావరీ మండలసభ జరిగింది.

నిష్కర్షగా చెప్పలేను, ఎనిమిదోదని జ్ఞాపకం, నాకది.

మోచర్ల రామచంద్రరావు పంతులుగా రధ్యక్షత వహించారు.

చాలామంది వచ్చారు, జిల్లా అంతణ్ణుంచీ ప్రతినిధులు.

కావడానికి జిల్లాసభేకాని, తక్కిన జిల్లాలనుంచిన్నీ వచ్చేవారు పెద్దలు చాలామంది, ఆరోజుల్లో.

తెనుగు రాజకీయ జీవితానికి పాక్షికవిషమూ యెక్క లేదు, కులతత్వ పిశాచమూ ఆవహించలేదు, అప్పటికింకా.

ఆరోజుల్లో, రాజమహేంద్రవరంలో, కే.యల్. ఎన్. సోమయాజులుగారు వర్థమానచంద్రులు గ్రంథప్రకాశకుల్లో.

"రెయిల్వే లిట్రేచరు" బాపతు గ్రంథాలు ప్రకటించేవారు, వారు.

స్కూలు వాచకాలున్నూ విరివిగా అమ్మేవారు.

ఆ సందర్భంలో, పాఠశాల ఆవరణలో పుస్తకాల అంగడి తెరిచారాయన.

ఎస్.పి.ఏ.ఎల్. బతికివుండిన దినాలవి.

కనక, మిథునానురాగమూ తక్కిన నా గ్రంథాలూ ఆ అంగడిలో వుంచాన్నేను, కమిషను పద్ధతిమీద.

అనుభవాలూ - జ్ఞాపకాలూను - 3

487