Jump to content

పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/506

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అది గుర్తించి, "ప్రాప్తవ్య మర్ధం లభతే మనుష్య" అన్న అదృష్ట సిద్ధాంతం జ్ఞాపకంచేస్తూ చలమయ్య శాస్త్రిగారి నవతలికి తీసుకువెళ్ళారు మా నాయనగారు.

అందుకూ యిందుకూ కూడా సంతోషించాన్నేను.

తగిలిన ఆఘాతం-తీరని అపకారం మరిచిపోలే రెవరూ.

ఎంత సద్దుకుందా మన్నా యెదురు దెబ్బ కొడదామనే అనిపిస్తుంది, ఉప్పూ కారమూ తినేవాళ్ళ కెవళ్ళ కయినా.

మరి, అదే పట్టుక్కూచోడమేనా?

దెబ్బ నాటాకయినా సముదాయించవద్దూ అవతలివాళ్ళని, మరెవరయినా?

మా అమ్మగారు చేసిందీ, మా నాయనగారు చేసిందీ కూడా యిది.

ఇందుకూ నా సంతోషం.

అందరు బంధువులమధ్య-ముఖ్యంగా మా అమ్మగారికి, మా నాయనగారికీ, మా సీతకూ యెదట లభించిన నా అఖండ విజయానందానికి, యిదిగో, యిదోక మహోచ్ఛ్వాసం అయింది నాకు.

12

వీరపూజ మీదికి పోయింది, నా చూపు.

స్థాయిభావం యేర్పడిపోయిందా విషయమైనాకు.

తెనుగులో అపూర్వరచన, నా వీరపూజ.

అంతకి ముందేకాదు, తరవాతకూడా అలాంటి రచన మరి పుట్టలేదు మన వచన వాఙ్మయంలో.

ఇది గర్వంలో లెక్క అవుతుందా ?

నా శక్తిమీదకంటే నా వీరపూజమీద నిశ్చలమైన విశ్వాసం వుంది నాకు, కనక, అందుకు సిగ్గుపడన్నేను.

కచ్చితంగా చెబుతాను, నా వీరపూజ విశిష్ట రచన.

అయితే, యెంతమంది గుర్తించాంది?

పోనీ, యెంతమంది గర్హించారు?

చెడ్డపుస్తకం పుడితే, అది దేశం అంతా పాకిపోవలసిందేనా?

మంచి పుస్తకం బయలుదేరితే, అది, మూలపడిపోవలసిందేనా?

ఇదిగో, యీ రకమైన ఔదాసీన్యం యెక్కువగా వుంది, తెనుగుజాతిలో.

రచయితలు బయలుదేరినంత మంది విమర్శకులు బయలుదేరలేదు, మనలో.

రచయితల్లో పోటీలేర్పడ్డం అగత్యం; కాని స్పర్థలేర్పడతాయి సాధారణంగా లోకంలో.

అసహనాలు బలిసిపోతాయి.

మాత్సర్యం రెచ్చిపోతుంది.

నిరాదరణ, ఈసడింపు, నింద, దుష్ప్రచారం, వొళ్ళు మండబెట్టుకోడం - ఇవి హెచ్చిపోతాయి, చివరికి.

482

శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి.