Jump to content

పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/504

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇదిగో, యీ ఆవేదన గుబగుబ లాడించేసింది, నన్ను.

రచనకు దీక్ష పట్టాను, వెంటనే.

ఎన్నాళ్ళుగానో అనుకుంటున్న వీరపూజ రచనకు శ్రీకార మున్నూ చుట్టేశామ, అవ్యవధానంగా.

11

ప్రవాహవేగం తప్పించుకోడం కష్టం.

మంచిదయినా చెడ్డదయినా, అలవాటయిన పని మానుకోడమున్నూ కష్టమే.

పరిస్థితులలా తటస్థిస్తాయి, ఒక్కొక్కప్పుడు.

నా స్థితి అంతే అయింది.

తప్పనిసరిగా మళ్ళీ అష్టావధానం చెయ్యవలసి వచ్చింది, నేను.

మా పెద్దన్నగారి కుమారుని ఉపనయనం.

బంధువులు చాలామంది వచ్చారు, బహు కాలానికి.

వేట్లపాలెంనుంచి దర్భా చలమయ్య శాస్త్రిగారున్నూ వచ్చారు.

అష్టావధానం చెయ్యమంటూ కూచున్నారు నన్నందరూ.

ఏమిటేమిటో చెప్పాను, నేత్రావధానాని కవకాశాల్లేవన్నాను, అదిలేందే అష్టావధానం యేమిటన్నాను; కాని, తృప్తి పడి వూరుకోలేదు వారు.

"నే నెప్పుడూ చూడలేనిదది. ఎక్కడెక్కడో చేస్తావు నువ్వు, మాకెలా కనపడుతుందీ అది?" అంటూ నిర్బంధించారు స్త్రీలున్ను.

మా అమ్మగారిచేత అడిగించారు వారామాట.

"నాకూ చూడాలని వుంది నాయనా" అన్నారామె.

"కాని - ఆలోచించుకో" అన్నారు చివరికి.

నెగ్గితే అందరికీ సంతోషమే.

ఓడిపోతే మరి ఖేదం?

మా అమ్మగారి దవుతుంది, ముఖ్యంగా.

నేనిలా అర్థం చేసుకున్నాను “ఆలోచించుకో" అన్న మా అమ్మగారిమాట.

మా నాయనగారు స్వయంగానూ నన్నందు కాజ్ఞాపించరు, వొకరి మాటమీదా గట్టిగా చెప్పరు.

పైగా, నన్నేకాదు, వారినీ మందలిస్తారు కూడా.

నా దృష్టిలో, మా అమ్మగారి పదవివేరు, మా యింటో.

నాకు మాతృదేవత కావడం అలావుండగా, మా నాయనగారు పెట్టిన బాధలో - ముఖ్యంగా మా చిన్నన్నగారు పెట్టిన యమచెరలో - నిరాశ చేసుకుని నేను కుమిలి పోయాటప్పుడు, ఎన్నో మాట్లు - తరచు నాకు నవజీవం పోస్తూ వచ్చినవారామె.

"కాదు" అనలేకపోయా నామె మాట, అందువల్ల.

అనిష్టంగానే - వొక విధంగా నిరుత్సాహంగానే కూచున్నాను; గాని చాలా బాగా నెరవేరిం దదిన్నీ.

480

శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి.