Jump to content

పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/503

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఊళ్ళో వున్న బ్రాహ్మలందరూ, రెడ్లు కొందరూ, సమీపం కావడం వల్ల బిక్కవోలునుంచిన్నీ సరసులు కొందరూ వచ్చారు.

అక్కడా నేత్రావధానంలో నిర్వహించవలసి వచ్చింది, వ్యస్తాక్షరి.

అవధానం చాలా చక్కగా నెరవేరింది, చివరికి.

అంతా సంతోషించారు.

సూర్యనారాయణగారు చెప్పగా, రెడ్డిగారున్నూ బలపరచగా వచ్చినవారిలో కొందరు తమకు తోచిందిచ్చి వెళ్ళారప్పటికి.

పదమూడు రూపాయ లయిందా మొత్తం, అది సత్యనారాయణశాస్త్రి కిప్పించాన్నేను.

ఆ రాత్రే పడవమీద వెళ్ళిపోయాడతను, భోజనానంతరం.

మర్నాడు నేనూ ప్రయాణమైనాను; కానిరెండురోజులుండి పోవలసివచ్చింది నాకు.

ఆ రెండురోజులూ నాకు విందులు జరిగాయి, నేను సాహిత్య ప్రసంగాలు చేశాను.

రెండోనాటి సాయంత్రం నా ప్రసంగం ముగిశాటప్పటికి తరవాత తమచేతి కందాయని చెబుతూ పాతిక రూపాయలు నాకు సత్కరించారు కరణంగారు "మీ కేమివ్వగలం?" అని కించపడుతూ.

సంప్రదాయ మహితమైన కుటుంబం వారిది, పండితుల నాదరించడమే చేతనైన వ్యక్తులువారు. ఎంతెంతో యిచ్చిన్నీ అలాగే మాట్టాడతారు, వా రెప్పుడూ.

పాతిక వొకట్లు కాదు, పాతిక కోట్లిచ్చిన్నీ అలాంటి తృప్తి, అలాంటి ఉల్లాసమూ కలిగించలేరు పండితుల కెవరూ.

దూరం వెళ్ళనక్కరలేదు ఆచుట్టుపట్ల గ్రామాల కరణాలందరూ వడ్డాదివారూ, బుద్ధవరపు వారూ, ముంజులూరివారూ, బంధకవివారూ, వాడ్రేవువారూ, ముష్టివారూ, నేలకంటివారూ, ఏనుగువారూ - అందరూ యుగంధర ప్రజ్ఞావంతులే - అందరూ సంపన్నులే - అందరూ ఉదారులే - మేమంటే అందరూ ప్రత్యేకాదరాభిమానా లున్నవారే.

అష్టావధానం చేస్తానంటూ నేను వెడితే అందరూ నన్నాదరిస్తారు, సందేహం లేదు.

కాని, ఏమి సాధించినట్టు అంతవరకూ చేసిన అవధానాల వల్ల నేను?

డబ్బందామా, దానికోసం బుర్రచించుకుని అవధానాలే చెయ్యనక్కరలేదు, సాహిత్య ప్రసంగాలు చేసిన్నీ మంచిమంచి వార్షికాలు సంపాదించుకో గలన్నేను.

కాక, - ఆశుకవిత్వాలూ, అవధానాలూ, బంధకవిత్వాలూ, చిత్రకవిత్వాలూ - ఇలాంటివి బయలుదేరి, మనవాళ్ళకి సిసలైన కవిత్వం గుర్తించకుండా చేశాయి.

కవితాభిరుచే నాశనం చేశాయి.

"పద్యమే కవిత్వం" అన్న దురభిప్రాయమున్నూ కలిగించాయి.

దీంతో, అవధానాలంటే వై ముఖ్యమేకాదు, వైనమస్యమున్నూ కలిగిపోయింది నాకు.

"మరి, గజంయెత్తు పుస్తకాలు రచించా"లన్న వ్రతం నెరవేర్చుకోడం యెప్పుడూ?

అనుభవాలూ - జ్ఞాపకాలూను - 3

479