Jump to content

పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/502

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సూర్యోదయ సమయాని కదయాక, తొమ్మిదింటికి కుప్పుసామయ్యరు హోటల్లో భోజనం.

మళ్ళీ వొంటి గంటకీ, రాత్రి యెనిమిదింటికీ కూడా అలా భోజనమే.

మధ్యాహ్నం మూడింటికి ఫలహారమూ, కాఫీని.

దానాదీనా పట్టుకుంది నాకజీర్తి.

రాజమహేంద్రవరం విడిచి యింటికి వెళ్ళి పోవలసి వచ్చింది ఆరోగ్యం సాధించుకోడానికి నేను.

రాజమహేంద్రవరంలో యిద్దరుముగ్గురు పెద్ద డాక్టర్లే మందిచ్చారు నాకు, వ్యాధి తగ్గలేదు కొంచెమున్ను.

ఇంటికి వెళ్ళాక, ఆయుర్వేదంలో నా మొదటి గురువు అంగర వెంకటాచార్యులుగా రొక లేహ్యం చేసియిచ్చి, ఇచ్ఛాపథ్యంతో మళ్ళీ వొక నెలలోనే వృకోదరుణ్ణి చేశారు నన్ను.

వారి అనుగ్రహరూపంగా "నాగరఖండం” అన్న పేరితో అదే నే నిప్పుడు నా గంధర్వఫార్మసీలో వాడుతున్నది.

వర్షాలు కురిసి నాట్లు బలపడ్డాక మళ్ళీ పదచలనం ప్రారంభించాన్నేను.

వడ్డాది సూర్యనారాయణగారని, మాకు నాలుగు మైళ్ళలో వున్న బలభద్రపురం గ్రామంలో వొక సంపన్న నియోగి గృహస్థులు.

అక్కడి హెడ్ కరణం వారు.

అంతక్రితం "అష్టావధానం చూడాలని వుంద”న్నారు వొక మాటు నాతో వారు.

ఆ మాట పురస్కరించుకునే వెళ్ళానప్పుడు నేను.

"మీకు తగిన సత్కారం చెయ్యలే”నన్నారు వారు.

"డబ్బుకోసం రాలేదునేను. మీకా కోరిక తీరివుండకపోతే తీర్చడానికే నారాక, 'తీరా చూశాక యే కొంచెమయినా డబ్బివ్వక పోతారా?' అన్న గడుసుభావం లేదు నా కే కోశానా. గృహస్థు మర్యాదగా అతిథ్యం మాత్రమే యివ్వండి నాకు, చాలు” అని చెప్పాన్నేను, స్పష్టంగా.

"అయితే, వొకమాట చెప్పాలి ముందు. నా అష్టావధానంలో నేత్రావధానం వొక ఆంగం. నా సహచరుడున్నాడతను నిర్వహిస్తాడది. నే ననువదిస్తాను. నన్నే నిర్వహించమంటే అత ననువదిస్తాడది. కనక, అదిన్నీ కావాలంటే మాత్రం అతనుకూడా రావాలి. అతనికి మాత్రం పదిరూపాయలయినా ముట్టచెప్పవలసి వుంటుంది, మరి" అని కూడా చెప్పాను.

అప్పుడక్కడ వొక రెడ్డిగారున్న వున్నారు.

వారడగ్గా నేత్రావధానం వివరాలు చెప్పాన్నేను.

"అయితే, అష్టావధానమూ చేయించ వలసిందే మీరు, నేత్రావధానం దాల్లో వుండేటట్టున్నూ చూడవలసిందే" అన్నారు వారు కరణంగారితో.

ఆ రెడ్డిగారి ప్రోత్సాహంతో, వెంటనే జాబురాసి గ్రామ నౌకరునంపి, కడియపులంకనుంచి సత్యనారాయణ శాస్త్రిని రప్పించారు వారు.

ఆ సాయంత్రమే అవధానం.

478

శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి.