కాని, నాచేతిలో పడలేదది.
దాని ఫలితమున్నూ బెజవాడతో చెల్లిపోయింది.
అయినా, ఆయన ఔదార్యం నిలిచివుంది.
అమ్మకం అయిపోయిన ఆ బడుగుదేహాన - అదిగో - పరిపూర్ణ మానత్వం స్వస్వరూపంతో తేజరిల్లుతోంది.
అమరం అది.
ద్వంద్వాతీతం.
జగజ్యోతి.
కఠోరతపస్సుచేసి, మహాయోగీశ్వరులే సాధించుకోతగ్గదిన్ని.
ఎందరు గుర్తిస్తారిది?
అసలు, ఎందరు గుర్తించగలరిది?
లోకుల రుచులు బహుముఖాలు.
వారి చేతలున్నూ అనేకవిధాలు.
అనంతకోటి ప్రజానీకంలో యే యిద్దరికీ పొంతన వుండదిలాంటి సందర్భాల్లో.
ఎంతో కొంత భేదం వుంటూనే వుంటుంది.
అవిలంఘ్యాలైన అగాధాలు కల్పిస్తుందది మానవతలో.
నలుగురూ చూశాటప్పుడేగాని, యెవరికీ యేమీ యివ్వలేరు, కొందరు.
వీళ్ళూ-చాళ్ళూ-యెన్నో - యెంతెంతో చూసుకుని గాని యివ్వలేరు, కొందరు.
"దేహి” అని దీనంగా అనిపించుకునిగాని యివ్వలేరు కొందరు.
విసుక్కుంటూ - వొళ్ళు మండబెట్టుకుంటూ - దాన ధర్మాల వ్యవస్థను తిడుతూనేగాని యివ్వలేరు కొందరు.
నిరసనగా చూస్తూ - నీచంగా మాట్టాడుతూ మీదికి గిరవటేస్తారు కొందరు.
వీధే వెళ్ళేవారిని పిలిచి, ఏదో అనవసర ప్రసంగం చేస్తూ సాక్ష్యానికన్నట్టు వారిని దగ్గిర కూచోపెట్టుకుని, వారు వినేటట్టున్నూ అర్థిని చులకనచేస్తూ యిస్తారు కొందరు.
ఇవన్నీ మనోవికారాలు.
కోతి చేష్టలు.
త్యాగం విలవ తక్కించుకోలేని వెకిలితనమున్ను.
తామస ప్రవృత్తి యిదంతా.
రహస్యంగా యిస్తారు కొందరు, మూడో కంటి వాడికి తెలియకుండా.
ఎప్పుడుపడితే అప్పుడే - యెలా వుండినవా రలాగే - యిచ్చేస్తారు కొందరు.
"దేహి” అన్న మాట వినలేక ముందే యిచ్చేస్తారు, కొందరు.
ఎలాగో వొకలాగ యివ్వడమూ - ఇవ్వకుండా వుండలేక పోడమూ - ఇవి హృదయానికి సంబంధించిన కదలికలు.
ఏమయినా, యివ్వడంలో కొంత త్యాగం వుంది, సందేహం లేదు.
కొంత ఔదార్యం వుంది.
476
శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి.