దానా దీనా, పంచాగ్ని మధ్యం అన్నట్టయిపోయిం దక్కడ మా పని.
"అవధానం చెయ్యాలి, కంభం మెట్టు విడిచి పెట్టాలి" అని దీక్ష పట్టుకుని వుండకపోతే ఆ వారంరోజులూ కూడా మేమక్కడ వుండలేకే పోదుం.
ఆతిథేయి మా కెన్నో సదుపాయాలు చేశారు, సాదరంగా.
నిజంగా, ప్రాణం యిచ్చారు మాకు, వారు.
ఇద్దరు పెద్దమనుష్యులు—మర్నాటి మధ్యాహ్నం వొకరూ, రాత్రి వొకరూ విందులు చేశారు.
కాని, మరి, వుండలేకపోయాం.
మా స్థితి చూసి “ముందుకి వెళ్ళవద్దన్నారు," అతిథేయీ సభా నిర్వాహకులూ కూడా.
నే నాలోచనలో పడ్డాను; కాని "వెళ్ళిపోదాం" అంటూ మూటే కట్టేశాడు, సత్యనారాయణశాస్త్రి.
ఆరాత్రే రెయిలుకి బయలుదేరాం.
టిక్కట్లిమ్మనగా డబ్బు పుచ్చుకోనన్నాడు బుక్కింగుక్లర్కు.
"మీ అవధానం చూశాను, చాలా ఆనందించాను. నా జేబులో పర్సు లేకపోయిందా సమయాన. ఉండినా బీదవాణ్ణి. చెయ్యాలనేగాని చెయ్యడానికి లేదు శక్తి. అయినా, బెజవాడ దాకా మీ కిద్దరికీ టిక్కట్లిచ్చుకుంటా" నంటూ రెండు టిక్కెట్లూ చేతిలో పెట్టి నమస్కారాలున్నూ చేశాడాయన.
చాలా ముగ్ధుణ్ణయిపోయా న్నేను.
కోట్లు డబ్బిచ్చినా అలాంటి తృప్తి కలగదు, కళావేత్తలకు.
నిజాని కాయన యిచ్చింది బహూ స్వల్పం.
ఆరోజుల్లో - నలభై నాలుగు సంత్సరాల కిందటి రెయిలు రేట్లు తెలుసుకుంటే మరీ స్వల్పం.
కాని, ఆ యిచ్చిన విధానంలోనూ, ఆ యిస్తూ అన్న మాటల్లోనూ, వొక బహూ సమాన్యు డెంతెంతలేసి మహోన్నత శిఖరాలందుకోవచ్చునో చూపించాడాయన.
ఎంత సుళువుగా అందుకోవచ్చునో కూడా చూపించాడు.
డబ్బులేనివాడాయన, ఆయనే చెప్పాడు.
కాని, హృదయం వున్నవాడు.
రసబంధురం ఆ హృదయం.
ఔదార్యమున్నూ వుంది, దానికి జీవం పోస్తూ.
విశేషించి మాట నేర్పుంది.
వినయంతోతుంది దానికి.
ప్రాగల్భ్యం పొటమరించింది, అసమవాయంతో.
ఒక్కటే అన్నా డాయన మాట.
ఆయన హృదయం పొర్లి వచ్చిందది.
నా హృదయమున్న నిండిపోయింది.
ఆయన డబ్బిచ్చాడు, అది నిశ్చయం.
అనుభవాలూ - జ్ఞాపకాలూను - 3
475