Jump to content

పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/484

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అందరు పురుషుల్లో నే శృంగారవిషయాలు వివరించడం అసభ్యం అనిపించు కుంటుందసలు.

కాని యీ బిడియం వున్నట్టు లేదాయనకు.

"వద్దువ"ద్దన్నారు భావనారాయణప్వొమిగారు.

“తప్పుత"ప్పన్నారు పాపయ్యగారు, చిరాగ్గా.

నాయడుగారు చాలా గట్టిగా అక్షేపించారు, చల్లచల్లగా.

దాంతో వొదిలి పోయిందా బెడద.

అవధానం కూడా పూర్తయింది.

ఒక్కగంటా, ముప్ఫయి నిమిషాలు పట్టిందందుకు.

నాకంటే సభ్యులూ, సభ్యులకంటే నేమా మహోత్సాహ తరంగాలమీద వూగిపోయాం.

మాటి మాటికీ "సెబాసు"లు ప్రతిధ్వనించాయి.

"అన్‌పాదమ్డు కేప్సుబేర్ ఫుల్ యే జెమ్ ఆఫ్ ఫ్యూరెస్టురే” ఇత్యాదిగా వ్యస్తాక్షరి వొప్పగించాను మొదట.

చాలా వింతపడి, మిక్కిలి ఆనందించి, థాంక్సు చెబుతూ లేచి, ప్రీతిగా - ఉద్రేకంతో షేక్‌హాం డిచ్చాడు దొర.

మెల్లిగా కూసినవీ, గట్టిగా కూసినవీ బూరా కూతల కూడా వివరంగా చెప్పినప్పుడు కరతాళ ధ్వనులకున్నూ పూనుకున్నాడాయన.

తక్కిన పృచ్ఛకులున్నూ తమ గాఢ సంతృప్తి వెల్లడించారు.

సభ్యులందరూ చాలా ఆనందించారు.

నేను కృతజ్ఞత చెప్పుకున్నాను, చివరికి.

నాయడుగారు లేచారు వెంటనే.

“శాస్త్రిగారు తమ ప్రజ్ఞ చూపించారు. మనం మన రసికత చూపించుకోవాలిప్పుడు. వారికొక బంగారుమెడ లివ్వడం మనకు మర్యాదగా వుంటుందనుకుంటున్నాం మేము. దొరగారు మొదటే పది రూపాయలిచ్చారు. మనమున్నూ యెవరికి తోచింది వారు - తోచినంతే - తోస్తేనే యిద్దాం. నిర్బంధం లేదు. ఇప్పుడే యిద్దాం, కనీసం, రేపు సాయంత్రాని కయినా నాకందాలి" అన్నారు.

అంటూనే పర్సుతీశారు, తామున్ను.

పాపయ్యగారూ తీశారు, వెంటనే.

ఎవరెవరో కూడా తీశారు.

అప్పటికప్పుడు - అక్కడికక్కడ - యెనభై రూపాయలకు పైగా వసూలయినాయి.

మర్నాటి సాయంత్రానికి మరికొంత చేరింది.

ఒక జామారుకొని, తులంనర బంగారంతో ఆ వూళ్లోనే మెడలు చేయించి, మరోరెండు రోజులకు అదీ అదీ పాపయ్య గారిచేత నాకు బహూకరింపించారు. నాయడుగారు, తమ యింటనే చిన్న సమావేశం జరిగించి.

చెయ్యిపట్టుకుని స్టీమరుదాకా వచ్చి, టిక్కట్టు తామే కొని, పొదివిపట్టుకుని స్టీమరెక్కించి, నన్ను కేబినులో కూచోపెట్టి, నా రెండు చేతులూ పట్టుకుని

460

శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి.