Jump to content

పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/482

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

"వల్లకా"దంటూ వితండవాదానికి సిద్ధపడ్డారు మొదట కొందరు; కాని, నేను బదులు చెప్పవలసిన అగత్యం లేకుండానే అది పరిష్కారం అయిపోయింది.

దీంతో, పృచ్ఛకులుగా సిద్ధపడ్డవారిని వడబొయ్యవలసి వచ్చింది.

కాగా, పృచ్ఛకులుగా నిర్ధారణ కాగలిగినవారందరూ, పెద్దలూ, మెరికల్లాంటివారూ కావడం తటస్థపడింది.

ఒక విధంగా అపాయకరమూ, మరోవిధంగా గౌరవావహమున్నూ యిది.

సమర్థులయిన వారిని తృప్తిపరచడమే తృప్తిపరచడం, మరి.

వెంటనే, పృచ్ఛకులు చుట్టూ కూచున్నారు, కుర్చీలమీద, నా కటూ ఇటూ.

సబ్‌కోర్టు శిరద్దారు సమస్య యిచ్చారు, శార్దూల విక్రీడితంలో.

గాదె దాసన్న పంతులుగారు (స్కూళ్ళ యినస్పెక్టరు) లోకాభిరామాయణాని క్కూచున్నారూ "శాస్త్రిగారూ, ప్రారంభిస్తామా” అనడుగుతూ.

భావనారాయణస్వామిగారు దశావతారాల పేళ్ళు చెప్పమన్నారు కందంలో, వరస తప్పకుండా.

ఎస్టేటు గుమాస్తా వొకాయన (పాపయ్యగారి నామినీ) గంటలకు బదులు కూతల క్కూచున్నారు, సైకిలు బూరా చేత బుచ్చుకుని.

నాయడుగారు పురాణం చెప్పమంటూ కూచున్నారు, భాగవతం తెరుచుకుని.

మేఘ సందేశం పాడ్డానిక్కూచున్నా డొక వకీలు విద్యార్థి.

ఆచంట వెంకటరావుగారు (మా సోమప్ప ప్లీడరు) చదరంగం బలం సద్దుకూచున్నారు, ఎత్తు వెయ్యడానికి సిద్ధంగా.

"నేనివ్వవచ్చా?” అనడుగుతూ అధ్యక్షులు సిద్ధపడ్డారు, వ్యస్తాక్షరికి.

5

కార్యకారణ సంబంధాలు పురస్కరించుకుని, భావనారాయణ స్వామిగారిమీదా, నాయడుగారిమీదా, పాపయ్యగారిమీద వొక్కొక్క పద్యం కట్టుకుని వున్నా నదివరకే నేను, ఆశువుగా అల్లుతున్నట్టుగా నటించలేదు.

ప్రెసిడెంటుమీద మాత్రం అప్పటి కప్పుడు కట్టాను, -

క. అష్టావధానమను। నుత్కృష్టక్రియ చూడనేగుదెంచిన ఘనుడీ మిస్టర్. జి.యల్.డి. క్రూజ్ హృష్టుండగునట్టు లిప్పుడే నొనరింతున్ అని.

తనపేరు రావడం - అదిన్నీ సంగీతంలో రావడం - ఇది గుర్తించి చకితుడై, నాయడుగారి నడిగి సంగతి తెలుసుకుని తల పంకించుకున్నాడు, దొర.

పద్యాలు పూర్తిచేసి నా సంగతి చెప్పుకున్నాను, ముందు.

నా పూనిక హేతువున్నూ చెప్పుకున్నాను, తరువాత.

"డబ్బుకోసం కాదు. భావనారాయణస్వామిగారి ఆజ్ఞ శిరసావహించడానికి మాత్రమే వచ్చా”నన్నాను చివరికి.

నిర్దాక్షిణ్యంగా నమ్ముకున్నారు పృచ్ఛకులు వెంటనే,

స్త్రీలూ పురుషులూ ఆబగా చూడసాగారు.

458

శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి.