Jump to content

పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/479

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జమీందారు, రాజా, శ్రీ కొచ్చర్లకోట రామచంద్ర వేంకటకృష్ణారావుగారు, పోలవరం విడిచి, యెప్పుడో కాకినాడలో మకాం పెట్టుకుని వుండినారు.

అంచేత, అక్కడి జనులకు పాపయ్యగారే జమీందారన్న ఆదరగౌరవాలు.

“ఫలానా విద్య తమకు తెలుసునా తెలియదా - అధవా - దానిమీద తమకు ప్రీతి వుందాలేదా" అని కాదు ప్రశ్న, విద్య యేదయినా అది పోషించడమే జమీందారు బాధ్యత.

జమీందారంటే, తెనుగు దేశానికంటే సంబంధించినంత వరకూ మహారాజనే నిర్వచనం.

సర్వతంత్ర స్వతంత్రమైన ప్రభుత్వం, ఇక్కడ. బహువచనం మీదే వుండేది, ఆదిలో.

కాని, శతాబ్దులకిందే అంతరించిపోయింది.

ఢిల్లీలో పాదుషాలూ, గోల్కొండ హైదరాబాదుల్లో నవాబులూ స్వతంత్ర ప్రభువులయి వుండినంతకాలమూ తెలుగు దేశంలోనూ వుండేవారు ప్రభువులు.

ఆంగ్లేయు లిక్కడ స్థిరపడ్డంతో చాపచిరిగి చదర అయిపోయింది.

మహారాజు లంతరించారు, జమీందార్లే వెలిశారందరూ.

సామంతు లనిపించుకోడానికిన్నీ అర్హతలేనివారు జమీందార్లంటే.

యోధులను గుమాస్తాగిరికి మప్పింది ఆంగ్లప్రభుత్వం, ప్రభువులను జీరాయితీ దార్లుగానూ రూపొందించింది.

అయినా, అనువంశికాలైన లక్షణాలు నిలుపుకున్నారు, జమీందార్లు కొంతవరకూ.

అంచేత, ప్రభువుల లక్షణాలు మనకూ పరిచితాలే కొంత వరకూ.

రాజులు కాకపోయినా, తెనుగుదేశంలో, యిటీవల వారే "రాజా"లు కనక, జమీందార్లున్నూ తమ విధులు నిర్వర్తించుకున్నారు, కొంతవరకూ.

ఇంత, -

ప్రీతి వైయక్తికం.

విద్యలు సార్వజనీనాలు.

వాటి ప్రయోజనం, ముఖ్యంగా, జనులకు.

కనకనే వాటి పోషణభారం ప్రభువుది.

ఈ పరిజ్ఞానం వుండాలి, మనిషికి.

అధికారమూ వుండాలి.

ప్రభువు లక్షణాలివి.

జనులను తమ అదుపాజ్ఞల్లో వుంచుకుంటూ, వారి కష్టార్జితం కొంత, పన్నులపేరిట నిర్బంధంగా వసూలు చెయ్యాలి, ప్రభువు.

సుఖ సౌభాగ్యాలు కలిగించి, ఆ జనులను రంజింపనూ చెయ్యాలి.

ఇది తప్పనివాడే మహారాజు.

తప్పాడూ, మరి, తరాజే.

అంచేత, పోలవరంలో జరిగే యే కార్యక్రమంలో నయినా, జమీందారుకి బాధ్యత వుందంటే, వారికి ప్రతినిధులు కనక, పాపయ్యగారే అవి నిర్వర్తించేవారు.

చాలామట్టుకి, స్వతంత్రంగానే నిర్వహించే వారది.

అనుభవాలూ - జ్ఞాపకాలూను - 3

455