Jump to content

పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/477

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇష్టాపూర్తిగా కాదు, బాధపడుతూ అనేశాను.

నన్ను నేనే తిట్టుకుంటూ - నా సంచితాన్ని నిందించుకుంటూ - అంగీకరించాను.

అయితే, వొక్కటి మాత్రం చెప్పుకోవాలిక్కడ.

పోలవరంలో వొకమాటు చేసివుండడం వల్ల - అక్కడ హోహో అనిపించుకునిన్నీ వుండడం వల్ల - దిలాసాగానే అంగీకరించా నతని ప్రతిపాదన.

ఓనమాలు దిద్దుకోవలసిన అగత్యం లేకపోయింది, నాకందులో.

నిద్రాహారాలు మరిచి సాధనచేసుకోవలసిన దుర్గతికూడా లేకపోయింది.

ఒక్క దూకున సభకి - సభలోకి - వెళ్ళ వచ్చు, నిస్సంకోచంగా కూచో వచ్చు ధీమాగానే ప్రారంభించనే వచ్చు అవధానం.

ఇదీ, అప్పటి. కీడులో నాకొక మేలు.

4

పోలవం అష్టావధానం జ్ఞాపకం వస్తే నా కిప్పటికీ పులకలు పేటెత్తుతాయి.

ఆసన్నివేశం అనుభూతం అవుతున్నట్టుంటుంది, కళ్ళక్కట్టినట్టున్నూ వుంటుందా పరిస్థితి.

శాలువు కప్పుకుని, సభలో నిటాగ్గానుంచుని, పృచ్ఛకులకేసి చూస్తూ "ఏమికావాలి మీకు?" అని అడుగుతున్నట్టున్నూ వుంటుంది.

ఏ వొక రిద్దరో అప్పటికే అపరిచితులై వుండినవారు తప్ప, తతిమ్మా పృచ్ఛకులందరూ పడగొట్టాలన్న స్వర్థతో కసిగా చూస్తున్నట్టుకూడా వుంటుంది.

ఒక నిర్దేశం లేదు, వొక సూచనలేదు, వొక ప్రయత్నం లేదు, వొక ఆలోచనలేదు, చూసినంత సేపూ వొక వినోదం చూశాను, కళ్ళనిండా - అప్పటి కప్పుడొక అగ్నిపరీక్షకు సిద్ధపడ్డాను, సర్వమూ మరిచి.

జరిగిం దేమిటంటే?

"ఇదిగో, నేను తయారయి వచ్చాను మరి, సభ చేయించం"డంటూ వెళ్ళి యెదట నుంచునేటప్పటికి చకితులయిపోయారు, భావనారాయణస్వామిగారు.

అప్పటిదాకా ఆజ్ఞాపకమేలేదు వారికి.

అప్పుడయినా "అప్పుడలా యెందుకన్నాము ?" అంటూ బాగా పశ్చాత్తాపపడు తున్నట్టుంది, వారివాలకం.

అది యేమయినా, వారప్పుడు నన్నలా రెచ్చకొట్టి వుండక పోతే నా జీవితంలో అష్టావధాన ప్రసక్తే రాకపోయి వుండును.

దానికోసం కొంత సాధనా చేసుకుని వుండకపోదును, అందు కోసం ప్రత్యేకించి పోలవరమూ వెళ్ళి వుండకపోదున్నేను.

మరి, వారు సభ చేయించకపోతే?

నా వుత్సాహం గాఢంగా దెబ్బతింటుంది.

కొన్నాళ్ళయినా చాలా బాధ పడతాన్నేను.

ఇది గుర్తించుకున్నారు వారు, మరి, కాదనలేకపోయారు.

అనుభవాలూ - జ్ఞాపకాలూను - 3

453