Jump to content

పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/470

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అష్టావధానం అంటే, ఎదటా పక్కలా వెనకా కూడా కమ్ముకుని ఆక్రమణ చేసే ఎందరో శత్రువులను కాసుకోవడం.

కాక, - శతావధానం సత్యనారాయణశాస్త్రికి ప్రమేయం వుండదు, పద్యాలు కట్టలేడు కనక.

అష్టావధానంలో అయితే కల్పించుకోడానికి చాలా అవకాశం వుంది.

అతనితో కలియడం అష్టావధానికే యెక్కువ శ్రేయస్కరం.

కనక, నేత్రావధానంలో వుండుకున్న పామర రంజకశక్తి బాగా గుర్తించగలవాడైతే, అష్టావధాని, కోరీ, ప్రార్థించీ, ప్రలోభ పెట్టీకూడా తనకు సహచరుడుగా చూసుకుంటాడు.

అంచేతనే, మనస్సు కలసిన పూర్వపరిచయానికీ వూహ తోడుకాగా, ఎన్నోమాట్లు వచ్చాడు నాకోసం అతను.

ఎంతో ప్రయత్నించాడు.

ఒకమాటు రెండురోజు లుండిపోయాడు కూడా, నాబసలో, ఎలాగయినా నన్నొప్పించాలని.

ఆ రెండురోజుల్లోనూ, నలభై యేడుగంటల యాభై తొమ్మిది నిమిషాలపాటు చాలా గట్టిగానే ప్రతిపక్షం చేశా నతని ప్రతిపాదన, నేను.

కాని, చెప్పానుగా?

నా డబ్బు ఇబ్బంది బలీయం కావడంతో, చివరికి “సరే” అనేశాను, కళ్ళుమూసుకుని.

3

నిజానికి, ఆధిలో, కవిత్వం పరంగానే పుట్టింది అష్టావధానం; కాని కవిత్వం మాత్రం వుండ దందులో.

వో-ట్టి పద్యాలు మాత్రం వుంటాయి, కొల్లలుగా.

ఆ పద్యాలు వదులు వదులుగానూ వుండవచ్చు, బింకం గానూ వుండవచ్చు, కాని కాగితప్పువ్వులూ అవీ వొకటే రాశి.

అయినా, వాటికోసమే యెగబడతారు పామరులు.

“తక్కువ కులాలవారు - అధవా - చదువుకోనివారు" అని కాదు, పామరులంటే నా నిర్వచనం, "అర్థజ్ఞానమూ - అది వుండినా రసగ్రహణశక్తి లేనివారు" అని మాత్రమే.

వారిక్కూడా, శుద్ధ శుష్కాలయినా, రసమహితాలే అయినా పద్యాలు విని ఆనందించాలంటే, అందుకొక అనుపానం వంటి దేమయినా వుండాలి, దండిగా.

పామరులదృష్టిలో, పద్యాలకా అనుపానం వంటిది సంగీతం వొక్కటే.

కాని, విని, అనుభవించి, ఆనందించాలంటే మరోకళ తోడ్పాటక్కరలేదు కవిత్వానికి.

సహజంగానే మధురాతిమధురం అది.

ముఖ్యంగా, సంగీతమే దానికి తోడు కావాలనడం అజ్ఞానం.

446

శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి.