Jump to content

పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అంచేత, యాభైయేళ్ళ వయస్సున పెళ్ళంటే, ఆ రోజుల్లో, విడ్డూరమూ కాదు, నిందావహమూ కాదు.

కాగా, మా మీనయ్యతాతయ్యగారు మళ్ళీ పెళ్ళిప్రయత్నంలో వున్నారన్నమాట పుట్టాటప్పటికి, పొడగట్లపల్లి కాపురస్తులు వడ్రి లక్ష్మీనరసింహశాస్త్రిగారు తమ రెండో కొమార్తె నివ్వడానికి నిశ్చయించుకున్నారు.

ముక్కామలకూ పొడగట్లపల్లికీ రెండుమైళ్ళ వెడల్పున వశిష్ఠ గోదావరి మాత్రమే అడ్డు.

అప్పుడే కా దిప్పటికీ రాకపోకలు జరుగుతూనే వుంటాయి ఆ వూళ్ళ బ్రాహ్మలకు దినమ్మూ .

ఈ రాకపోకలతో వొకరి సంకల్పాలూ, వొకరి వుద్దేశాలూ, వొకరి ఆశలూ వొకరి నిరీక్షలూ అవగాహన అయిపోయా యిద్దరికీ.

వర్గత్రయ పరిచయంవల్ల సంప్రదాయాదికం పరిశీలించుకోవలసిన అగత్యం లేకపోయింది వారికి.

పిల్లని చేసుకోవాలనీ యిస్తామనీ వున్నచోట తిరస్కరించడం మన శాస్త్రీయ సంప్రదాయమూ కాదు, అప్పటి మన వాళ్ళలో మర్యాదస్థుల పద్దతి కాదు.

ఈ కారణాలవల్ల సంబంధం స్థిరపరచుకోడానికి మా మాతామహులు పొటగట్లపల్లి వెళ్ళారు.

రాగిడీ, చంద్రవంకా, సూరీడూ, చంద్రూడూ తమలపాకూ, మొగలిరేకూ, పాపిడిపిందిరీలూ, జూకాలూ, దండ తావేజులూ - అడ్డబాసా మొదలైన - ప్రథమ కళత్రం తాలూకు నగలన్నీ మూటకట్టుకుని మరీ వెళ్ళారు.

వీటి సొగసూ తెలియదు, ఇవి ధరిస్తే వచ్చే నిండూ బోధకాదు, వీటి ఉద్దేశమూ గుర్తుకి రా దిప్పటివాళ్ళకి “పాత కాలపు మోటునగ"లన్న అపోహ తప్పిస్తే.

అందమే కాకుండా సంపన్నతకున్నూ గుర్తివి ఆ కాలపువారికి.

మా తాత గారవి పట్టుకుని గుమ్మంలోకి వెళ్ళేటప్పటికీ పదకొండేళ్ళపిల్ల వీధిలో ఆడుకుంటోంది.

ఆమె యింటివారి పిల్లే అయివుంటుం దనుకుని "అమ్మీ, శాస్త్రులుగా రున్నారా?” అనడిగి, వున్నారని ఆమె చెప్పగా లోపలికి వెళ్ళారు మీనయ్యగారు.

మామూలు మర్యాదలు జరిగాయి.

సంగతి గుర్తించి స్త్రీలు, వీధిలో వున్న పిల్లని దొడ్డిదారి నింటోకి తీసుకువెళ్ళి కట్టీ తొడిగీ తీసుకువచ్చి తండ్రిదగ్గిర కూచోపెట్టారు, వరుడి కెదురుగా.

ఆమె చెల్లెలున్నూ రమారమీ తొమ్మిదేళ్ళది చిరుబొజ్జ మీద చొంగ కార్చుకుంటూ వచ్చి అక్కగారి వెనక నుంచుంది.

నగలమూట విప్పి మీనయ్యగారు పిల్లకేసి చూశారు.

వీధిలో తాము పలకరించిన పిల్లే కావడం చూసి, చకితులై “నా కక్కర్లే దీపిల్ల" అనేశారు, వెంటనే

"నే నీపిల్లను వీధిలో చూశాను. 'అమ్మీ' అని పిలిచాను; కనుక, నే నీమెను పెళ్ళిచేసుకోగూడ"దనిన్నీ చెప్పేశారు వెంటనే.

అనుభవాలూ - జ్ఞాపకాలూను - 1

23