Jump to content

పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/469

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అయితే, సభ అంటే అనంతకోటి ప్రజానీకానికి అనిర్దిష్ట ప్రాతినిధ్యం వహించే పరిమిత జనుల సమావేశం.

అందరూ పండితులయినవారే వుండరు దాల్లో.

తమాషాలు చూడ్డానికి వచ్చే నేలబారు మనుష్యులే అధికంగా వుంటారుకూడా, అందులో.

కనక, విద్యలక్కంటేనూ కళలక్కంటేనూ వినోదాలకే యెక్కవ చెల్లుబడి సభల్లో.

గోష్ఠి అయితే మాత్రం యెంత పాండిత్యం అయినా చూపించవచ్చు, ఎంత రసికత అయినా కనపరచవచ్చు.

సభకి వెడితే సత్యనారాయణశాస్త్రి, దగ్గిరవున్న రంజక శక్తి నేత్రావధానం వొక్కటే.

కాని, బరిమీద అదొక్కటీ చాలదు.

ఉపాంగంగా మాత్రమే చూపించతగ్గదది, ప్రధానంగా కాదు.

కనక, మరో రంజకశక్తి కలవాడితో కలియడం అగత్యం అయిందతనికి.

ఆ మరో రంజకశక్తి పద్యబంధం అయి, ఆ మరో మనిషి అష్టావధానిన్నీ అయివుంటే?

"దోచెయ్యవచ్చు" నన్న పేరాస, యిదిగో, యీ నమ్మకంతో కలిగిందతనికి.

ఇంకొకటి కూడా చెప్పాలిక్కడ.

అష్టావధానం మీద వున్న ఆదరభావమూ, వ్యామోహమూ శతావధానం మీద లేవతనికి.

శతావధానంలో జటిల లేదంటా డతను.

"నూరుగురికి చెప్పాలి పద్యాలు, నిజమే. కాని పనిమాత్రం వొక్కటేగా” అన్నాడతను, పెదవి విరుస్తూ.

ఆశుధార వుండినవారెవరైనా చెయ్యవచ్చు శతావధానం, సుళువుగా.

అష్టావధానం అయితే, యెనిమిది పనులు చెయ్యా లొక దానికొకటి సంబంధం లేనివి, ఏకకాలాన.

ఆ యెనిమిదీ కూడా చాలా జాగ్రత్త పడవలసినవే.

పైగా “సమిష్టి బాధ్యత"కలవి కూడానూ అవి.

ఒకటి చెడ్డా అంతా చెడిందన్నమాటే.

కనక, అనేకవిధాల సావధానత కనబరుచుకోవా లష్టావధానంలో.

“ఆల్‌రౌండు మనిషి - బహుముఖ ప్రజ్ఞాశాలి” కావాలి, అష్టావధానం చెయ్యాలంటే.

అంచేతనే రంజకత్వమూ, ఆకర్షణా యెక్కువ, దాల్లో.

ఎనిమిది - వంద - ఈ మొత్తాల కుండుకున్న అంతరం చాలా గొప్పదే.

మూర్తిమంతంలో సింహానికీ ఏనుక్కీ వుండుకున్న అంతరం వంటిదది.

కనక, అంతరం మాత్రమేకాదు చూడవలసింది, అంతస్థుగాని.

శతావధానం అంటే, ఎదటబడి ఆక్రమణచేసే శత్రువుని కాసుకోడం మాత్రమే.

అనుభవాలూ - జ్ఞాపకాలూను - 3

445