Jump to content

పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/468

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పద్యాలు కట్టడానిక్కవే కానక్కరలేదు.

తక్కిన అన్ని హంగులూ వున్నాయి, పద్యం కట్టడం మాత్రం కుదరలే దతనికి.

"కవిత్వం లేకపోతే మానె, చక్కని కల్పన అయినా వుండక పోతే యెందు కాపద్యాలూ?” అని యెదురడిగా డతనొకమాటు. "పద్యమే కట్టలేవూ?” అనడగ్గా.

"పద్యం వేరూ, కవిత్వం వేరూను" అన్న పరమార్థం తెలిసిన వారు చాలా అరుదు మన పదాన్యుల్లో.

ఈ జ్ఞానం కవుల మనుకునేవారిలో కూడా చాలామంది కున్నట్టు లేదు.

“ఛందస్సులో వుండే నాదం వేరూ, సంగీతంలో వుండే నాదం వేరున్ను” అన్న సత్యం తెలిసినవారు కూడా చాలా తక్కువ మన రసికుల్లో.

ఈ విషయం యెంతో గంభీరంగా వివరించా డతనొకమాటు.

ప్రసక్తాను ప్రసక్తంగా, తిరుపతి శాస్త్రిగారికీ వేంకటశాస్త్రిగారికీ చాలా అంతరం వుందన్నాడతను.

"తిరుపతి శాస్త్రిగారి దగ్గిర సాధారణంగా జనులాట్టేచేరరు”ట.

"వేంకటశాస్త్రిగారిని మాత్రం పదులూ పాతికలూ వందలూ చుట్టుకుంటారు”ట, కళ్ళ బడ్డం తడువుగా.

"అదంతా ప్రస్తావచాతుర్యం" అని అతని నిర్ధారణ.

"ఝడితి స్పూర్తీ, మాటల్లో యెదురు దెబ్బ తీసే నేర్పూ, పద్యం చదవడంలో వొడుపూ, బలగం కోసం విచక్షణలేకుండా ప్రతీవాణ్ణీ చేరదీసుకోవడమూ, చేతికందిన వాణ్ణల్లా తమ గొడవల్లో యిరుకించుకుని మరి కదలకుండా చేసుకోవడమూ-వెంకటశాస్త్రిగారి సత్తా యిది. ఇదే కవిత్వం అనుకుంటుంది పామర లోకం" అని అతని వివరణ."

"వో-ట్ఠి శబ్దార్థంగాణ్ణి పట్టుకు పాకులాడతా వేమిటోయ్?" అనడిగారుట వెంకటశాస్త్రిగారు, తిరుపతి శాస్త్రిగారినోమాటు, కళ్ళతో తనని నిర్దేశిస్తూ.

“వినపడిందా?" అన్నట్టు, సాకూతంగా చూశారుట తనకేసి తిరుపతి శాస్త్రిగారు.

“దానికి బదులు చెప్పాలంటే కొంచెం పెద్దమాట వాడాలి; కాని అది తిరుపతి శాస్త్రిగారి సమక్షం కావడం వల్ల మూగ వాణ్ణయి పోయాన్నేను, కావాలని” అన్నాడతను.

తిరుపతి వెంకటకవులను గురించి కచ్చితమైన అతని వివరణ "విడిపోతే తిరుపతిశాస్త్రిగారు జవరంజనచేయ్యలేరు. స్వశక్తినే నమ్ముకుంటే వెంకటశాస్త్రిగారు పండితుల యెదటా, పండిత కవులయెదటా నిలవలేరు" అని.

మా రామకృష్ణశాస్త్రిగారున్నూ యెన్నో మాట్లన్న మాటయిది.

ప్రసంగవశాన, దివాన్ మొక్కపాటి సుబ్బారాయుడుగారి సన్నిధిని, పురాణపండా మల్లయ్యశాస్త్రిగారున్నూ వొకమాటన్నమాట యిది, మా రామకృష్ణశాస్త్రిగారితో.

అయినా, తిరపతి వేంకట కవుల్లాగ తానుకూడా సభలకు వెళ్ళాలనీ, వోహో అనిపించుకోవాలనీ వుబలాటం అతనికి.

444

శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి.