2
అయితే, అష్టావధానంలో మిక్కిలి కష్టసాధ్యమైనది నిషిద్ధాక్షరీ, మిక్కిలి సులభసాధ్యమైనది నేత్రావధానమున్ను.
ఏమంటే?
నిషిద్ధాక్షరి నిర్వహించాలంటే నికరమైన సాహిత్యమూ, నిశితమైన పద్యస్పూర్తీ వుండాలి. నేత్రావధానం నిర్వహించాలంటే మాత్రం కళ్ళూ, ఆకళ్ళలో చూపూ వుంటేచాలు.
ఆచూపన్నదయినా రాసి చేతికిచ్చింది గ్రహించగలగడానికే. కనుగుడ్లుంటేనే చాలు, సూచించడానికి.
తంతివార్తచేత్తో కొడతారు, నేత్రావధానం కళ్ళతో కొడతారు, అంతే భేదం.
నేత్రావధానానికీ అక్షరసంధాత (కంపోజిటరు) కూ వుండవలసిన యోగ్యత వొక్కటే, అది అక్షరజ్ఞానం వుండడం.
కనుగుడ్లు అటూయిటూనూ, గిరగిరానూ - గబగబానూ, అచిఆచీ రెప్పలల్లార్చడమూ ఇంతే నేత్రావధానం.
అదీ వొక విద్యే అనుకుంటే, మూఢులూ మూర్ఖులూ కూడా చెయ్యవచ్చు, అది నేర్చుకోడానికీ, సాధనచెయ్యడానికీ రెండు రోజులయినా అక్కర్లేదు. పూర్తిగా.
వల్లించవలసిన మాటలూ, చింతన చేసుకోవలసిన రచనా, అవగాహన చేసుకోవలసిన విషయమూ, అలవర్చుకోవలసిన నిపుణతా, జ్ఞాపకం వుంచుకో వలసిన కథా - కనీసం యేకరువు పెట్టుకుంటూ వుండవలసిన గ్రంథమూ - ఏమీ లేవందులో.
భావమే లేదందులో, భావుకత అసలే అక్కర్లేదు.
రబ్బరు బొమ్మకూడా కళ్ళు తిప్పుకుంటుంది, కీ యిస్తే.
కేవలమూ శుష్క ప్రక్రియ అది.
నలుగురిలోనూ వున్నప్పుడు ప్రేయసీ ప్రియుడూ కళ్ళతోనే మాట్లాడుకుంటారు.
ఎన్నెన్నో రహస్యాలూ, ఎంతెంతలేసో ఆంతర్యాలున్నూ మాట్టాడుకుంటారు.
అతిమథురాలూ వుంటాయి వాటిలో, యెన్నో.
భావుకతకూ గ్రహణశక్తికీ ప్రాముఖ్యం ఇక్కడ.
ముఖ్యంగా స్త్రీలకు - వారిలోనూ మళ్ళీ తరుణుల కెక్కువగా వుంటుందా నేర్పు.
హావభావాలతోనే వారి వ్యవహారాలకు నిర్వహణ, మరి.
పురుషుల నెందు కెందుకో ఆజ్ఞాపించడానికీ, తమ చుట్టూ తిప్పుకోవడానికీ ఆవిధానమే అవలంబిస్తారు వారెక్కువగా.
ఆకళ్ళతోనే రకరకాల అవసరాలు తీర్చుకుంటారు వారు.
అదొక విద్య.
సామాన్యం కాదు, చాలా గొప్ప విద్య.
కేవలమూ విద్యమాత్రమే కాదు, కళకూడానూ.
కళ్ళల్లోనూ, మళ్ళీ, లలితకళ.
నేర్చుకుంటే వచ్చేది కాదది, స్వయం వ్యక్తం కావలసింది.
442
శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి.