Jump to content

పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/465

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దాని నిజమైన పేరు “తపస్సు”

ఈ విషయమై నాకింత నిశ్చయజ్ఞానమూ, యింత దృఢనమ్మకమూ వుండినా, నన్నుపూర్తిగా పెడదారిని పట్టించింది, అష్టావధాన వ్యామోహం.

గురూపదేశం, లేకుండా స్వయంకృషితో సాధనచేస్తే “యిది నిష్కృష్టం అవునా కాదా?" అన్న మీమాంస కలుగుతూ వుంటుందెవరికయినా, ఎప్పుడైనా.

నాకు సంభవించిం దిదే.

కొంతక్కొంతయినా నా జీవితం వ్యర్థంగా గడిచిపోడానికిదే ముఖ్యకారణం.

ఈ కారణం వల్లనే సత్యనారాయణశాస్త్రి మాట కాదనలేక పోయాన్నేను.

అయితే, అతను కవికాకపోవడం వల్ల, జంటకవులం కావడానికి వీల్లేకపోయింది మాకు.

మొలలోతు దుఃఖంలో మోకాలిలోతు సంతోషం అన్నట్లు, నా దురదృష్టంలో యిదొక అదృష్టం.

మేము జంటకవులమే అయినామా, స్పర్థ, ఉత్సాహం, కీర్తికాంక్ష - ఇలాంటి ప్రలోభాలతో పెనవేసుకుపోయినా జీవితం అంతా నిరర్థకం అయిపోయివుండును, పూర్తిగా.

నాగురువులు జంటకవులే; కాని జంటకవుల సిద్ధాంతం యెప్పుడూ ఆమోదించలేదు నేను.

సమర్థులే అయినా, యిద్దరు కవులు సమిష్టిగా కవిత్వం సాగిస్తామనడం హాస్యాస్పదం.

కవిత్వానికే అపచారం అది.

చాలా మాట్లే వచ్చింది నాగురువుల దగ్గిరకూడా యీ చర్చ.

ఇది విని, వొక్కమాటే స్పష్టంగా చెప్పారు వారిద్దరూ కూడా "వ్యవహారరీత్యా మాత్రమే దాని ప్రయోజనం" అని.

"అయినప్పుడు, మరెందుకూ కవిత్వం పేరు చెప్పుకుని కలియడం?"

దీనికి సత్యనారాయణశాస్త్రి, చెప్పిన ప్రత్యుత్తరం “మన అష్టావధానం విశిష్టమై మిక్కిలీ జనరంజకం కావడానికి" అని.

ఈ జనరంజకత వొకటే అష్టావధానంలో వుండుకున్నది, మరో పరమార్థం లేనేలేదు.

మేమిద్దరమూ కలిస్తే అది మాత్రం మే మనుకున్నదాని కంటే యెక్కువగా కలుగుతుంది, సందేహం లేదు.

నేనష్టావధానం చెయ్యగలిగితే అతను నేత్రావధానం చెయ్యగలడుమరి.

వీటిలో వొకటి చలవగలవెన్నెలా, మరొకటి కలిమిగల పరిమళమున్ను.

కనకనే, అష్టావధానం అంటేనే యెన్నో మాట్లెంతో తిరస్కరిస్తూ వచ్చాను, గాని యీ విశేషం కనపడ్డాక మరి కాదన లేకపోయాన్నేను.

అతని క్కలిగినంత కాకపోయినా, నాకూ కలిగింది “మనం వొక్కళ్ళమూ బయలుదేరితే రూపాయవచ్చేచోట, అతణ్ణి కలుపుకుంటే పదిరూపాయలు వస్తాయన్న నమ్మకం.

అనుభవాలూ - జ్ఞాపకాలూను - 3

441