Jump to content

పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/464

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అంతగా క్షుభితం అయిపోతూవుండిన మనస్సున్నూ నిశ్చలం అయిపోయేది, మంత్రించినట్టు.

ప్రపంచమే తెలిసేది కాదు.

మత్తు-మైమరుపు-పారవశ్యం-మరేమయినా అనండి, అదేదో అది కలిగిపోయేది నాకు.

యాతనా బహుళమైన మానవజీవితంలో స్తుతిపాత్రాలైన మధురక్షణాలివి.

అయితే, కళావేత్తలా, కళాపరులా సఫలజీవితాల్లో మాత్రమే ప్రసన్నాలవుతాయివి.

సామయికంగానైనా ద్వంద్వచింత నశిస్తేనే కలిగేవిన్నీ యివి.

కనక, దేవతలకున్నూ ప్రలోభజనకం యీస్థితి.

“సమాధి" అని దీనికే మారుపేరు.

బుద్ధి సూక్ష్మతా, నిపుణతా, ప్రతిభాత్వమూ - ఇవి బహుజన భాగధేయాలు.

ఇవి కావు ఈమధురక్షణా లేర్పడ్డానిక్కారణాలు.

చిత్తవృత్తికి చాంచల్యమూ - బాహుముఖ్యమూ మాత్రమే కలిగిస్తాయివి.

చిత్తవృత్తి నిరోధమే కలగవలసిన స్థితి యిది.

యోగీశ్వరులైన మహర్షులకే సిద్ధిస్తుందిది.

కనకనే "మహర్షి-కవి" యివి పర్యాయపదాలని చెప్పి వున్నా నొకచోట.

అయితే, ఋషిత్వం జాగృతం అయేచోట భాసించేది ఐక్యానుసంధానమూ, కవిత్వం జాగృతం అయేచోట భాసించేది రసనిష్ఠాను.

తోడబుట్టిన వివి; కాని భిన్న ప్రకృతికాలు.

ఐక్యానుసంధానం యేర్పడిందా, జగత్తు నశిస్తుంది.

ఆది లయం.

రసనిష్ఠ యేర్పడిందా, జగన్నిర్మాణం జరుగుతుంది.

ఇది సృష్టి.

ఇవి రెండూ సామాన్యుల కందనివి మాత్రమేకావు, అవగాహన కానివిన్ని.

సొంతానికి సాధ్యాలు కాకపోయినా, యోగుల సమాధ్యవస్థా, కవుల తన్మయావస్థా గుర్తించగలగడం మనిషికి గొప్ప పరాయణాలు.

నా యీ అవస్థ, మా నాయనగారు సకృతులుగానూ, మా చిన్నన్నగారు తరచుగానూ భంగపరిచేవారు.

మిత్రుల మనుకునేవారున్నూ చేస్తూ వచ్చారీపని.

నాశ్రేయస్సు కోరుతున్నా మనుకుంటూనే అలాచేస్తూ వచ్చారువారు, కాదనను.

వారికి దుశ్చింతా ఆరోపించలేదు.

కాని వారనుకున్నది కాదు, నే నాశించిన శ్రేయస్సు.

వారు పోషిద్దా మనుకున్నదీ కాదు నేను సాధించుకుందామనుకున్న శ్రేయస్సున్ను.

శ్రేయోరూపమైననా ప్రాప్యం సర్వాత్మనా వేరు.

దానికి చెయ్యవలసిన ప్రయత్నమున్నూ వేరు.

“ప్రయత్నం" అన్నదిక్కడ పామరభాష, "సాధన" అంటే దానికి సరిపోతుంది కొంచెం.

440

శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి.