మునికొడవలి విడిచి మానాయనగారు పొలమూరు ప్రవేశించాకగూడా తప్పనిదే అయింది మా కది, యేకొంచెమో.
మా తాతగారి దగ్గిరనుంచి మానాయనగారి కలవాటు కావడం - పొలమూరులో అతిథులూ అభ్యాగతులూ వస్తే మాయింటోతప్ప మరి భోజనం దొరక్కపోడం - ఈ రెండు కారణాలవల్లా మాకున్నూ వ్రతంకాని వ్రతమే అది.
ఆబాలగోపాలమూ అదొక ఘనతగా భావించుకుంటాం మేము.
"అభ్యాగత స్స్వయం విష్ణుః" అన్నమాట చిన్నప్పణ్ణుంచీ యెరుగదున్నేను.
దాని ఆంతర్యం పూర్తిగా గుర్తించడమూ, దానికి విలవ కట్టడమూ ఎవరికీ సాధ్యంకాని పనులు.
అతిథులను పూజించడమూ, అభ్యాగతుల నారాధించడమూ - ఇవి ఆర్ష సంప్రదాయాలు.
మన సంఘవ్యవస్థలో దైవికాంశ సంక్రమింప చెయ్యగల నిర్మాణాలివి.
కాని, కాలం మారింది, బుద్ధులు మారాయి, దృక్పథం మారింది. ధర్మం విలవలు మారాయి, రాజమహేంద్రవరం వంటి పట్నాల్లో పరిస్థితులూ మారిపోయాయి పూర్తిగా.
పొరుగూళ్ళు వెళ్ళినప్పుడు "అన్నం పెడతారా?” అని గృహస్థులనడగడం వైదికులుకూడా తప్పుగా — హీనంగా భావించుకోడం దాకా భ్రష్టులయిపోయిన రోజులివి.
బాగా పరకాయిస్తే, అలా అడగ్గలిగినవారిలో పంక్తి బాహ్యులుగా భావించవలసిన వారుంటున్నారు, చాలామంది.
ఇంతవరకూ నేను, అనేకవూళ్ళలో - అనేకుల ఇంటికి అతిథి గానూ వెళ్ళాను, అభ్యాగతుడుగానూ వెళ్ళాను.
అదొక భాగ్యంగా కూడా భాగ్యంగా భావించుకుంటున్నానిప్పటికీ నేను.
అన్నం దొరక్క నేనెక్కడా పస్తుండలేదు.
వైదిక ధర్మం విలుప్తమయిపోయేదాకా చెక్కు చెదర దీ సంప్రదాయం యీ భారత భూమిలో.
హోటళ్ళు విస్తరించడం యీకాలానికి తగ్గట్టేవుంది, కాదనను.
వాటి అగత్యమూ యెక్కువే, ఆక్షేపించను.
కాని, అప్పట్లో "యీ కాస్త సంసారభారమే మొయ్యలేమూ మనం?" చాలా అభిమానపడి పోయాన్నేను.
ఆ వయస్సున్న - పెళ్ళాం కాపరానికి వచ్చాకకూడా కానీకిన్నీ పరాపేక్షగా బతకడం హేయమే.
అయితే, అదృష్టవశాన, ఆ స్థితి యేర్పడ్డప్పుడే కలిగేది నాకీ ఆవేదన.
ఒక్కొక్కప్పుడు తల తిరిగిపోయేటంతగా కూడా కలిగేది.
దాంతో, ఎటుచూసినా శూన్యమే కనపడేది కళ్ళకి.
మనసున్నూ అయోమయావస్థలో పడిపోయే దెంత బిగపట్టుకున్నా.
కాని, ఉండుండి వ్యగ్రోత్సాహం కలిగిపోయేది రచన విషయమై, దానికదే.
అంతా - క్షోభ సమస్తమూ మరుపువచ్చేది, దాంతో.
అనుభవాలూ - జ్ఞాపకాలూను - 3
439