అసలు, నా గ్రంథరచనోద్యోగమున్నూ డబ్బుకోసం కాదు.
మరెందుకూ అంటే, యీ విచికిత్సే కలగలేదు నాకెప్పుడూ.
ఎలా కలిగిందో - యెందుక్క లిగిందో - యెప్పుడు కలిగిందో శుద్ధ అజ్ఞానదశలోనే కలిగిందినాకు, గ్రంథాలు రచించి గుట్టలు పెట్టాలన్న సంకల్పం.
“గ్రంథం" అంటే యేమిటి? దాని ప్రయోజనమున్నూ యేమిటి? పోనీ, అది రచించడమైనా యెలాగ? ఈ ప్రశ్నలయినా పుట్టని కేవల అభావదశ నా అజ్ఞానదశ అంటే.
తటవర్తి వెంకటరాజుగారి మామిడితోటలో, చీమతలకాయ లంతేసి అక్షరాల ఇంగ్లీషు పుస్తకం చూసినప్పుడు నాక్కలిగింది గ్రంథపరిమితి నిర్ధారణేకాని, రచనాసంకల్పం కాదు.
అప్పుడయినా నా హృదయంలో అలాంటి సంకల్పం జాగృతం అవుతోందని నే నెరగనే యెరగను.
ఆదిలో, సహపాఠులకూ, రెడ్లపిల్లకాయలకూ కథలు చెప్పే వాణ్ణి కల్పించి నేను.
తరవాత్తరవాత రాసేవాణ్ణి.
గ్రంథాలు రచించాలన్న నా సంకల్పాని కదే ప్రాతిపదిక యేమో నేను చెప్పలేను.
పోనీ, గ్రంథం అంటే యేమిటో స్పష్టంగా యిప్పుడయినా నిర్వచించగలనా నేను.
అది చెప్పడానికి నేనింతవరకూ చేసిన సాహిత్యవ్యవసాయమూ చాలదు, భావాంబరవిహారమూ చాలదు.
అంటే, నాదృష్టిలో, గ్రంథం అంతస్థు అంత గొప్పది.
అంచేతనే గ్రంథం రచించడానికి ముఖ్యంగా కావ్యం రచించగలగడానికి మనిషి మహర్షి అయి వుండాలన్న నమ్మకం నాకేర్పడ్డం.
మరి, మహర్షి అంటే?
ఇదిగో, యిది చెప్పలేకే నేను గ్రంథం అంతస్థు గొప్పదనుకోడం.
డబ్బు, మహర్షిని తయారు చెయ్యలేదు.
డబ్బు, మహర్షిని నడిపించనూలేదు.
డబ్బు భౌతికం, కవిత్వం ఆధ్యాత్మికం, తదాలంబమైన మహర్షిత్వం లోకాతీతమున్ను.
కనక, డబ్బుకీ కవిత్వానికీ లంకెపెట్టడం - అధవా - లంకె వుందనుకోడం కేవలమూ అజ్ఞానం.
డబ్బు భంగురమూ, కవిత్వం నశ్వరమున్ను.
కాదంటే, ఛందస్సుకీ డబ్బుకీ ఏమయినా లంకె పెట్టవచ్చునేమో కాని భావనకు మాత్రం అది పొసగదు.
ఛందస్సూ, పదరచనా బుద్ధివిభవాలు.
భావన పూర్తిగా హార్ధికం.
అది దైవికశక్తి.
బుద్ధి కందేది కాదది.
ఏమంటే?
అనుభవాలూ - జ్ఞాపకాలూను - 3
437