అభిమానం ముంచుకురావడం వల్ల యేర్పడిం దది నా కప్పుడయినా, అనివార్యంగా కాదు.
తరవాత కూడా, చాలాకాలం మానాయనగారే పోషించారు నన్ను; కాని "యిక నైనా సొంతంగా పొట్టపోసుకోవా" లనిపించింది, రాజమహేంద్రవరం నివాసంతో నాకు.
ఇరవైమూడో సంవత్సరం పూర్తికావస్తోంది నా కప్పటికి.
మానవజీవితాని కంతకీ నిగ్గయిన వయస్సది.
ఒక దృక్పథం యేర్పడ్డమూ, అది స్థిరపడ్డమూ, చివరి కది జీవన్మరణసమస్య అయిపోడమూ - ఇదీ ఆవయస్సులో ఏర్పడేస్థితి.
అంటే, జీవితానికి విలవ తెలిసివచ్చే సమయమూ, విలవ కట్టుకోవలసిన సందర్భమున్నూ అది.
ఒక విధంగా సాధకావస్థకు ప్రారంభం అక్కడ, మరో విధంగా పతనావస్థకు ఉపక్రమమున్నూ అక్కడ.
సాధకావస్థలో పడ్డాడా, నిద్రాహారాలు మరుపువచ్చే దశ అది.
పతనావస్థలో పడ్డాడా, విలాసాలమీదికి దృష్టి పోయే దశ అది.
ఈ దశల నిర్ణయం ఎవడికి వాడికే యేర్పడుతుంది, పరిసరాలను బట్టి.
వాటికి తగ్గ అర్థబలమైనా అంగబలమైనా కూడా తరువాతే యేర్పడతాయి, వాటికవే.
ఐహికజీవితాని కిదీ ప్రారంభక్రమం.
అయితే, సాధకావస్థ ప్రారంభమే అయివుంది, స్వాతంత్ర్యమే లేకపోయింది నాకప్పటి కింకా.
ఒక రుచి అంటూ దృఢంగా యేర్పడింది; కాని దానికి విఘాతాలు కలుగుతూ వచ్చాయి, ఎక్కడి కక్కడా, యెప్పటికప్పుడున్నూ.
కులవిద్య అన్న పేరితో మానాయనగారు నన్ను మరో విద్యలో కట్టిపడవేశారు, నిర్బంధంగా.
అదిన్నీ అంటకపోలేదు నాకు, కాని వెగటు పుట్టిపోయింది దానిమీద.
దారుణమైన ఘర్షణ యేర్పడపోయింది నా ప్రారంభజీవితంలో, యీవిధంగా.
కాని, నా ప్రయత్నం నేను మానలేదు.
నా సాధన కూడా నేను కట్టిపెట్టుకోలేదు.
ఇటు గ్రంథరచనా, అటు అష్టావధానవ్యామోహమూ - ఇంతే ప్రపంచం అయిపోయివుంది నాకు.
మరి, ఐహికమా, యిది, ఆధ్యాత్మికమా?
ఏమయినా, డబ్బే ప్రధానమా వీటికి? అంటే ప్రాప్యమా?
పోనీ, డబ్బు సంపాదించి గుట్టలు పెడతాయా యివి?
నిశితంగా పరిశీలన చేస్తే, వొకదాని కొకటి పొంతనలేని ద్వంద్వం యిది.
అవధానం సంగతి యేమయినా, వీటిలో గ్రంథరచన ప్రాప్యమే వేరు.
అది డబ్బు కానేకాదు.
436
శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి.