Jump to content

పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యాభై సంవత్సరాల వయస్సున కళత్రవియోగం సంభవించిం దాయనకు.

పోనీ అంటే సంతానమున్నూ లేకపోయింది.

అంచేత, మళ్ళీ వివాహ సంకల్పం కలిగింది.

యాభైయేళ్ళంటే మన కిప్పుడు ముసలితనంలోనే లెక్క కాని ఆరోగ్యాదికం విషయమై అప్పటి యాభైయేళ్ళవాడి కిప్పటి పాతికేళ్ళవాడున్నూ లొచ్చు.

ముఖ్యంగా, అప్పటి వైదికుల్లో, పురుషుడికి పెళ్ళి వయస్సు పాతికసంవత్సరాలూ, పెళ్ళాం కాపరానికి రావడం ముప్ఫయ్యేళ్ళు నిండాకానూ.

బ్రహ్మచర్యం అనేది అప్పటివాళ్ళే యెరుగుదురు.

వాళ్ళే ఆచరించారు కూడా.

పాతికేళ్ళదాకా అప్పుడు విద్యాభ్యాసంతోనే సరిపోయేది.

అది చాలించుకున్నాకే వివాహం మరి.

అంచేత, ఆహారవిహారాల్లో ఆ కాలంలో నీతినియమాలు చాలా యెక్కువ.

గురుశుశ్రూష చేస్తూ, వారాల భోజనం సంపాదించుకుంటూ, తదేకదీక్షగా చదువుకుంటూ, తాటాకుచాపలమీద గాఢనిద్ర అనుభవించేవా రప్పటి వైదిక యువకులు.

దీనికి సాయం, ఆ కాలపువాళ్లు జొన్న అన్నం తినేవారు.

వరి అన్నం వా రెరగనే యెరగరు.

అప్పుడు వరిపంటే చాలా తక్కువ, వున్న దయినా మెట్టపంట, మాగాణిపంటకాదు,

ఆ మెట్టపంట అయినా, యే యింటి కాయింటివాళ్లే స్వయంగా దంపుకున్న బియ్యం.

సాధారణంగా, అప్పు డయినా, పథ్యపానాలకూ, మహావైభవం అనుభవిస్తున్నా మనుకునేవాళ్లకున్నూ మాత్రమే వరిబియ్యం వినియోగం.

సంపన్నులూ జొన్న అన్నమే తినేవారు, అప్పు డదే నియతాహారం తెనుగునాళ్ళకి.

వరి అన్నం గొప్ప అనేమాట అప్పు డప్పుడే ప్రారంభం అవుతోంది, మెల్లిమెల్లిగా.

వయస్సు మళ్ళింది మొదలు, ఈ నమ్మకం పెట్టుకుని, మా పితామహులు శివరామసిద్ధాంతిదీక్షితులుగారున్నూ జొన్న అన్నం ముట్టి యెరగరుట.

రెండు పూట్లా వారి కొక్కరికి మాత్రమే వరిబియ్యం వండి పెట్టేవారుట మా నాయనమ్మగారు.

వారు భుజించగా యేమయినా మిగిలితే, మా మేనత్తగారూ, మా పెత్తండ్రులూ, మా నాయనగారూ "నాకు - నాకు" అంటూ కీచులాడుకునేవారుట చిన్నతనంలో, దినమ్మూ.

తరవాత్తరవాత యెన్నోమాట్లు చెబుతూవచ్చారు మా నాయనగారు "వరి అన్నం గొప్ప అనుకోడమే గాని - మిగిలింది యెదుటివాళ్లే యెందుకు తినాలీ అన్న పట్టుదల మాత్రమున్నే గాని - జొన్న అన్నం తిన్ననోటి కది చెరుకుపిప్పి నమిలి నట్టుండేది" అని.

కనక, ఆ జొన్నఅన్నం పిండశక్తీ కలిగించి వయస్తంభనమూ చేసిం దాకాలపువాళ్ళకి.

22

శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి - 1