ఇవాళ, పెళ్ళికొడుక్కీ పెళ్ళికూతురికీ గూడా ఏమిటేమిటో కానుక లందుతూనే వున్నాయి. కానయితే:
ఇదీ కో-ఆపరేషను సూత్రం కిందికే వస్తుంది; కాని వధూవరులకు మాత్రమే గాని పెళ్ళిపెద్దలకు లేశమూ ప్రయోజనం లేదు వీటివల్ల.
ఇది మంచిదికా దనను; కాని వెనకటి పద్దతి యింతకంటే చాలా మంచిది.
9
వరకట్నా లిటు పెరిగిపోతున్నాయి, ప్రోల్లో చదివించే కట్నాలటు
తరిగిపోతున్నాయి - ఈ సంధిసమయాన జరిగింది నాకు వివాహం.
అన్నట్టు, వరపక్షంవారు కన్యావరణం మానుకోడమూ వధువు పక్షంవారే వరాన్వేషణకు బయలుదేరడమూ బాహాటంగా జరిగిపోతోం దప్పటికే.
కాని నా అదృష్టంవల్ల నా వివాహం సందర్భంలో మాత్రం ఆ దురాచారం జరగలేదు.
స్వయంగా మా అమ్మగారే బయలుదేరివెళ్లి పిల్లను కుదిర్చారు నాకు.
శాస్త్రీయతతో పాటు మరో విశేషమున్నూ వుం దందులో - ఉన్నదల్లా యేమిటంటే?
నాకు మేనమామ లిద్దరూ పింతల్లులు ముగ్గురూను.
వారి కందరికీ మా అమ్మగారే పెద్దలు.
చిన్నప్పణ్ణుంచీ మా అమ్మగారూ మా పెద్దమేనమామగారూ నొక జట్టూ, మా పింతల్లులూ మా చిన్నమేనమామగారూ వొక జట్టూను.
ఈ జట్లూ యీ అభిమానాలూ ఇప్పటికీ నిలిచేవున్నాయి, వారి సంతానంలో కూడా.
అందరిలోనూ మా అమ్మగారి దగ్గిరా మా పెద్ద మేనమామ గారి దగ్గిరా లౌక్యమూ దాపరికమూ వుండేవికావు.
వారి అన్యోన్యత కదే కారణం అయివుంటుంది.
మా పింతల్లులు ముగ్గురూ వొకటయినా మా అమ్మగారికి లోటుండేది గాదు.
మా మాతామహులు కంభంపాటి మీనయ్యగారికి మా అమ్మగారిమీదే మిక్కిలీ అభిమానమూ, చాలా ప్రేమాదరాలున్నూ.
తక్కినవారంటే వారికి లేశమూ వైముఖ్యం లేదు గాని మా అమ్మగారి విషయమై విశేషశ్రద్ధ, అంతే.
అందుక్కారణం విన సొంపైనది.
కంభంపాటి మీనయ్యగా రంటే, తణుకుతాలూకా రైతాంగంలోనూ, రెండుమూడు తాలూకాల బ్రాహ్మణ్యంలోనూ యెరగనివారూ - కనీసం విననివారూ లేరు.
బ్రాహ్మణ్యంలో వూరి కల్లా స్థితిపరు లాయన.
మంచి వ్యవసాయదారులున్నూ.
వ్యవసాయదారు లంటే “బాపనవ్యవసాయం" కాదు, కమ్మవారికిన్నీ ఆదర్శమూ అనుసార్యమున్నూ అది.
అనుభవాలూ - జ్ఞాపకాలూను - 1
21