Jump to content

పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/446

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అదే భారతీయత.

కనక భరతఖండం మన అందరిదీని.

ఛప్పన్న దేశాలవా రందరిదీని.

ఇందులో వున్న రహస్యం యేమి టంటే?

పరిధి యెక్కువయినకొద్దీ ఏకత్వం సిద్ధిస్తుంది.

పరిధి తక్కువయినకొద్దీ వృథక్త్వం బలపడుతుంది.

పృథక్వం నుంచే ప్రారంభం.

అంచేతనే మన యిప్పటి రాజ్యతంత్రంలోనూ, వెనకటి రాజ్యతంత్రంలోనూ కూడా గ్రామమే పునాది.

కనక?

మొదట, మనం ఆంధ్రులం.

మన ఆంధ్రభాష బాధ్యతా, మన ఆంధ్ర జాతీయత బాధ్యతా పూర్తిగా మనవి.

ఈ బాధ్యతలు మనమే నిర్వర్తించుకోవాలి.

శాస్త్రీయమైన కృత్యవిభాగం యిది.

తక్కినవారికిన్నీ యివే బాధ్యతలు.

దీంతో అందరమూ బాగుపడతాం.

ఈ బాగు సార్వత్రికం అయి భరతఖండం జేగీయమానం అవుతుంది.

అంటే, ఈ భిన్నజాతుల జైత్రప్రస్థానానికి, చివరికి, భారత జాతీయత సంగమస్థానం అవుతుంది.

అదీ మన ధ్యేయం.

అదీ మన గమ్యం.

అదీ మన ప్రాప్యం.

అందుకూ మన పరాకాష్ట.

77

అదిగో - "మరి, కథ?” అన్న సమస్య నా కడ్డు పడ్డప్పుడు, ఇదిగో యింత మథనపడ్డా న్నేను.

మా పెద్దన్నగారూ, నా గురువులు రామకృష్ణకవులూ నిర్దేశించిన గ్రంథాలు చదవడంవల్లనే నా బుద్ధి వికసించిందెంతో కొంత.

బంకించంద్రుడి నవలలు చదవడంవల్లనే నాకొక దృక్పథం యేర్పడిందేదో విధంగా.

రచయితను కూడా కాగలిగా నేదో యెత్తున.

కనక, నేను రాసిన గ్రంథాలవల్ల కొందరికయినా బుద్ధి వికసించాలి, ఏకొంచెమయినా, నా తెనుగువాళ్లకి.

అంటే, నా రచన చదివిన ఆంధ్రుడు, పదహారణాల ఆంధ్రుడయి నిలవగలగా లెక్కడికి వెళ్ళినా.

ఇరుగుపొరుగు జాతులవారితో కలిసిమెలిసి వుంటూ, పనిపట్టినప్పుడు పదహారువన్నె భారతీయుడుగా రూపందగలగాలి, విశాలవిశ్వంలో.

అనుభవాలూ - జ్ఞాపకాలూను - 2

422