Jump to content

పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/445

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నా భారతజాతీయత సుస్థితికోసం తెనుగువాణ్ణిగా నేనిది దృఢంగా గర్హిస్తున్నాను.

మళ్ళీ దృఢంగా చెబుతున్నాను.

మొదట మనం ఆంధ్రులం.

వెంటనే మనం భారతీయులం అని స్ఫురిస్తుం దెవరికైనా.

ఆంధ్రభాష మన మాతృభాష కనక - మనం ఆంధ్ర జాతిలో పుట్టాం కనక - ఆంధ్రదేశం మన కాణాచి కనక - మొదట మనం ఆంధ్రులం.

మన ఆంధ్రదేశం భరతఖండంలో వొకభాగం కనక, వెంటనే భారతీయత మనకు సహజంగానే సిద్ధిస్తోంది.

ఇలాకాక మొదట మనం భారతీయులం అయితే?

మనం ఆంధ్రులమే అన్న స్ఫురణ యెలా కలుగుతుందీ?

మనం గుజరాతీలం అని యెందుకు అనుకోగూడదూ యెవరైనా?

తమిళులం అని యెందు కనుకోగూడదూ?

మరొకళ్ళ మనిన్నీ యెందు కనుకోగూడదూ?

మొదట మనం ఆంధ్రులం అనుకుంటే భారతీయులం కాక ఆఫ్రికన్ల మవుతామా?

అమెరికన్ల మవుతామా?

మరెవళ్ళమయినా అవుతామా?

కనక, మనకు భారతీయత మొదటి దనడం అవివేకం.

లేక మరెందుకో ప్రయత్నం.

మనుష్యుడు వొంటరిగా బతకలేడు.

బలగం కావాలి.

అంటే, సంఘం కావాలి.

అయితే, ప్రారంభం యెక్కణ్ణుంచి?

ఏమాత్రం బుద్ధి వుపయోగించినా విశదం అవుతుందిది.

ప్రతీ మనిషీ యెవడికి వాడే.

బలగం కావాలి, కనక, ఎవడి కుటుంబం వాడిది.

ఎవడి యిల్లు వాడిది.

ఎవడి వీధి వాడిది.

ఎవడి పేట వాడిది.

ఎవడి వూరు వాడిది.

ఎవడి ఫిర్కా వాడిది.

ఎవడి తాలూకా వాడిది.

ఎవడి జిల్లా వాడిది.

ఎవడి రాష్ట్రం వాడిది.

సరి, యింతవరకే ప్రత్యేకత.

ఆంధ్రుడికి ఈశ్వరుడు నిర్దేశించిన పరిధి యిది.

మరి, ఈ పరిధికి రక్షణ కావాలి.

దార్ఢ్యం కలిగించుకోవాలి మనం.

421

శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి