Jump to content

పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/444

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మనం ఆంధ్రులం.

మన భాషను మనం పోషించుకుంటాం.

మన జాతీయతను మనం దృఢపరుచుకుంటాం.

మన దేశం మనం బాగుచేసుకుంటాం.

తమిళుడూ ఇంతే చేస్తాడు.

కర్ణాటకుడూ, మహారాష్ట్రుడూ, ఓఢ్రుడూ, గుజరాతీ, బంగాలీ - తక్కినవారూ ఇంతే చేస్తారు.

మరి, భారతదేశమో అంటే, యింకెక్కడుందీ అది?

ఇలా కాకపోతే, మరెలాగ అది బాగుచేసుకోడం?

గుజరాతీ వచ్చి ఆంధ్రభాషనూ, ఆంధ్రజాతీయతనూ, ఆంధ్రదేశాన్నీ వుద్దరిస్తాడా?

ఉద్దరిస్తే ఆ గుజరాతీ సంగతి యెవరు చూస్తారు?

ఆ "యెవరి" సంగతి మాత్రం మరెవరు చూస్తారు?

ఇది గుర్తించుకోలేక ఏమిటేమిటో చిలకపలుకులు పలుకుతారు పరప్రత్యయనేయ బుద్దులు.

కాక, -

రామేశ్వరం అరవల దొక్కళ్ళదే కాదు.

తిరపతీ శ్రీశైలమూ మన ఆంధ్రులవి మాత్రమే కావు.

జగన్నాథం ఓఢ్రుల దొక్కళ్ళదే కాదు.

తక్కినవిన్నీ ఆ ప్రాంతాలవారివే కావు.

భారతజాతీయత స్వత్వాలవి.

భారతజాతీయతకు దోహదా లవి.

ఈ భావం వైదికధర్మం కలిగిస్తోంది మనకు.

ఈ మనభావం సంస్కృతభాష ధ్రువపరుస్తోంది.

కనక, ఆ వైదికధర్మం విడిచిపెట్టేసుకుంటే - ఆ సంస్కృతభాష కూడా విడిచిపెట్టేసుకుంటే - మన భారతీయతనూ, మన జాతీయతనూ, మన మానప్రాణాలనూ నిలపగలవాడు సృష్టిలో లేడు.

76

అయితే, పృథక్త్వం మొదటిదా, ఏకత మొదటిదా మనకు?

మనకు - అంటే ఛప్పన్న దేశాలవారికీ గ్రహణం.

మొదట మనం ఆంధ్రులం.

కనక, తరవాత భారతీయులం.

ఇంత సుస్పష్ట మైన ఈ విషయం తికమకలు చేస్తున్నారు కొంద రిప్పుడు.

అనుమానాలు కలిగిస్తున్నారు.

అపనమ్మకాలు పుట్టిస్తున్నారు.

అపాయకరమైన ప్రయత్నం యిది.

అనుభవాలూ - జ్ఞాపకాలూను - 2

420