Jump to content

పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/441

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాగా, అలౌకికమైన భారతజాతీయతకు అలౌకికమైన సంస్కృతమే భాషకావడం సహజంగానూ వుంది, ఎంతో గొప్పగానూ వుంది.

అది అర్థంచేసుకోవాలంటే చిత్తసంస్కారం వుండాలి.

పోతే, -

ఈ జాతీయభాష విషయమై మన మహర్షులు కనబరిచిన దూరదృష్టి మిక్కిలీ ప్రశంసాపాత్రం.

ఎంచేత నంటే?

భరతఖండానికి ఆంధ్రవంగాదు లన్నీ సమానాలే.

వాటిలో వాటి కీషత్తారతమ్యా లుండవచ్చు; కాని దానియెదట మాత్రం యేవొక్క దేశానికీ ఆధిక్యం లేదు.

అంచేత, వాటిలో వొకదాని భాషను భరతఖండానికి జాతీయభాషగా ఏర్పాటుచేస్తే, ఆ ప్రత్యేక దేశానికి తక్కినవాటికంటే వొకవిధమైన "శిష్ట"త్వం ఆరోపించిన ట్టవుతుంది.

ఆ దేశంవారి స్వార్థానికి దోహదం చేసిన ట్టవుతుంది.

తక్కిన దేశాల భాషలను అగౌరవపరిచిన ట్టవుతుంది.

తక్కిన దేశాలవారిని అనాగరకులని, ఆటవికులని, కిందపరచిన ట్టవుతుంది.

ఆ దేశానికది ఘనతా, తక్కినదేశాలకు అందువల్ల అపఘనతా అవుతుంది.

ఇంతటితో పోదు.

తక్కిన దేశాలవారి కీర్ష్యాసూయాజనకం అవుతుం దది.

దాంతో కలతలకున్నూ మూలం అవుతుంది, చివరికి.

అంటే “నా భాష అది. నాది కాదు. మనది కావడానికి దాని కర్హత లేదు” అన్న ద్వైధీభావం బయలుదేరుతుంది, తక్కిన దేశాలవారిలో, అవ్యవధానంగా.

"నీ భాష న్నేనెందుకు నెత్తి కెక్కించుకోవాలీ?” అన్న అభిమానమున్నూ పుట్టడాని క్కారణం అవుతుంది వారికి, అవ్యవధానంగా.

ఆ భాష యెవరిదో వారికి “మీరంతా పురుగులు" అన్న నిరసనభావం పుట్టిస్తుంది. తక్కిన దేశాలవారిమీద, తప్పనిసరిగా.

అపాయకరమైన సన్నివేశం యిది.

అంటే, భారతీయైక్యతకు కూకటివేరూ, వేరుపురుగూ వొక్కమాటే యేర్పడతాయి.

మహర్షులు రాగద్వేష రహితు లన్నాను.

త్రికాలజ్ఞానసంపన్ను లన్నాను.

దానికి సమన్వయం ఇలాంటిచోట కనబడుతుంది.

వా రాయోగ్యత యిక్కడ కనబరుచుకున్నారు, పూర్తిగా.

రాగద్వేషాల దుర్దమశక్తి యెరిగివుండినవారు కనక, వారు సప్రయత్నంగా అవి జయించినవారున్నూ కనక, సంస్కృతమే మనకు జాతీయభాషగా నిర్ణయించగలిగారు వారు.

వారి దూరదృష్టికి మరో నిదర్శనం చెబుతాను.

శ్రీరాము డయోధ్యావాసి.

417

శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి