Jump to content

పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/435

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మన మాతృభాషలు ఐహికాలకు మాత్రమే పరిమితాలు.

ఆధ్యాత్మికాలు వచ్చాటప్పటికి సంస్కృతమే మన కందరికీ శిరోధార్యం.

శిరోధార్యమే కాదు, గతిన్నీ.

వేదవేదాంగాలు మనం మన మాతృభాషల్లో అనువదించుకోవచ్చు.

వాటిలో ప్రతిపాదించబడివున్న ధర్మం, పామరులున్నూ తెలుసుకోడానికి మాత్రమే పనికివస్తా యా అనువాదాలు.

ధర్మాచరణ వచ్చేటప్పటికి మాత్రం మనం మనదేశ భాషలు వెనక్కి పెట్టుకోవాలి.

సంస్కృతమే స్వీకరించాలి.

తేలిం దేమి టంటే ?

ధర్మం యెలాంటిదో సంస్కృతభాషా మనకలాంటి దయింది.

కాగా, మన ధర్మమూ సంస్కృతభాషా అవినాభావాలు.

అంటే, -

మన ఛప్పన్న దేశాలవారికీ ఏవిధంగానూ చలించని ఏకత వుందంటే, దానిక్కీలకం యిదిగో, యిక్కడ వుంది.

అది సంస్కృతం మనకు జాతీయభాష కావడం.

"జాతీయభాష” అన్నమాట డిద్దడబిద్దశబ్దాల వంటిది కాదు.

ఎంతో గాంభీర్యమూ, ఎంతో గొప్పభావమూ గర్భితం అవుతున్నా యందులో.

జాతి జీవనాడికి అది ప్రవర్తకం మరి.

రాజకీయాలు - అంటే - రాజ్యతంత్రం జాతీయం కాదు.

ఆర్థికాలు - అంటే - వర్తక వాణిజ్యాలు జాతీయాలు కావు.

ఐహికాలు - అంటే - నిత్యకృత్యాలున్నూ జాతీయాలు కావు.

ఆహార నిద్రాభయాదు ల్లాగ మానవజాతి కంతకూ సామాన్యా లివి.

మానవజాతి మొత్తంమీద చూస్తే, వీటిలో ఈషద్భేదాలూ వుండవచ్చు, బృహద్భేదాలూ వుండవచ్చు.

మానవుల్లో వీటివల్ల కాదు ప్రత్యేకత లేర్పడ్డం.

ధర్మందగ్గిరే వస్తుంది బాహుముఖ్యం.

దాంతోనే మానవులొకరి కొకరు దూరందూరం అయిపోతారు.

ఈ ధర్మం పురస్కరించుకునే జగత్తంతటా రక్తం వెల్లువలయి ప్రవహించింది, గతంలో.

కనక, ధర్మమే జాతీయతకు మూలం యెవరి కయినా.

ఆ జాతీయతకు ప్రవర్తకం అయినదే జాతీయ భాష అవుతుంది.

తన మాతృభాష కోసం పడిచచ్చిపోతాడు బంగాళీ.

మహారాష్ట్రుడూ, గుజరాతీ, తమిళుడూ, కర్ణాటకుడూ, ఓఢ్రుడూ, మలయాళీ - వీరున్నూ తమతమ మాతృభాషలకోసం పడిచచ్చిపోతారు.

మనమూ అంతే.

ఎవరూ కూడా అంతే.

411

శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి