Jump to content

పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/430

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నా దృష్టిలో తెనుగుదేశమే దేశం.

తెనుగుభాషే భాష.

తెనుగు మనుష్యులే మనుష్యులు.

తెనుగువేషమే వేషం.

ఇంతేకాదు, -

ఏ జాతి యెదటా - ఏ సందర్భంలోనూ - ఎందుకున్నూ నా తెనుగుజాతి తీసిపోదు.

అంచేత, ప్రపంచాని కిది ఉద్ఘాటించి చెప్పడానికి, నా సేవలు తెనుగుజాతికే మీదుకట్టుకోవాలి నేను.

తెనుగులో మాత్రమే రచన చెయ్యగలిగివుండడంవల్ల కూడా, ఇంతకంటే మరో పరమార్థం లేకపోయింది నాకు.

అయితే "యిది పృథక్త్వానికి దారి తియ్యడం లేదూ?” అంటే, తప్పేం, వున్నదే. అదయినప్పుడు?"

ఇది చూసి, నా తెనుగువాళ్ళే కొందరు నిర్విణ్ణులయిపోతారు, నాకు తెలుసు.

కాని, యెవ రేమయిపోయినా సత్యం సత్యమే.

ఇది అవగాహన కావడానికి కొంత వివరణ చేస్తాను.

ఏమిటంటే?

మనిషయినవాడు, నివృత్తిమార్గంలో "నేను" "నాది” అన్న చిత్తవృత్తి చంపుకుంటేగాని ముందుకివెళ్ళలేడు, ముందు.

అలాగే, మనిషయినవాడు, ప్రవృత్తిమార్గంలో “నేను” “నాది" అన్న చిత్తవృత్తి దృఢపరుచుకుంటే గాని ముందుకి వెళ్ళలేడు, ముందు.

పరకాయించుకోగలిగితే, ప్రపంచం అంతటా వున్నదే యిది.

అర్థంచేసుకోగలిగితే, యీశ్వర నిర్ణయమే యిది.\ కనక, తెనుగువాళ్ళం మనం తెనుగువాళ్ళమే.

బంగాళీలు బంగాళీలే.

తమిళులు తమిళులే.

ఓఢ్రు లోఢ్రులే.

కన్నడులు కన్నడులే.

మహారాష్ట్రులు మహారాష్ట్రులే.

గుజరాతీలు గుజరాతీలే.

తక్కినవారున్నూ యెవరికీ వారే.

ఎంచేతనంటే?

వీరికందరికీ ప్రత్యేక దేశా లున్నాయి.

ప్రత్యేక భాష లున్నాయి.

ప్రత్యేక చరిత్ర లున్నాయి.

ప్రత్యేక సంప్రదాయా లున్నాయి.

ప్రత్యేకాకాంక్ష లున్నాయి.

అనుభవాలూ - జ్ఞాపకాలూను - 2

406