సర్వజ్ఞుడి స్థితి యిది.
సర్వాజ్ఞుడిదిన్నీ ఈ స్థితి.
అగత్యం యేర్పడితే - సంకల్పమున్నూ కలిగితే, మనిషిని ముందు కురికించేవే యీయీ రెండూ కూడా.
కా నయితే, వీరేశలింగం పంతులుగారివీ, చిలకమర్తి లక్ష్మీనరసింహంగారివీ, విజ్ఞానచంద్రికా గ్రంథమండలివారివీ కూడా కొన్ని నవలలు చదివ్వున్నా న్నేనప్పటికి.
తెలుగు భాషలో అప్పటి కపురూపా లవి.
సాహిత్యంలో నవ్యప్రక్రియలూ, వాఙ్మయంలో నవ్యరచనలూ, రచనల్లో నవ్య నిర్వహణరీతులూ కావాలనుకునేవారూ, అవి ఆచరించగలవారూ, రసానుభూతిలో కూడా నవ్యత అకాంక్షించేవారూ అందరూ, చదివా రవి.
నేనూ అందుకే చదివా నాబగా.
కాని, కథలూ కల్పనలూ మాత్రమే వున్నాయి వాటిలో.
"ఆహా” అని మాత్రమే అనిపించాయి నా కవి.
బంకించంద్రుని నవలలూ చదివాను, తరవాత, కొన్ని.
కథలూ, కల్పనలూ మాత్రమే కాక కవిత్వమున్నూ వుంది వాటిలో, పుష్కలంగా.
తామరమొగ్గమీద సూర్యకిరణాలు పడ్డట్టయింది, నాకు.
పెద్ద పాతు దొరికినట్టున్నూ అనిపించింది నాకు.
నా హృదయం స్పందించింది, అతివేలంగా.
కొత్తవెలుగూ కనపడింది నా కళ్ళకి.
రచయిత అయినవాడికి, ఇంగ్లీషుపరిజ్ఞానంవల్ల కలగవలసిన సంస్కారం బంకించంద్రుడి దగ్గిరే కనపడింది నాకు.
అవి చదివినప్పు డప్రయత్నంగా విశదం అయింది కొంత, సప్రయత్నంగానూ తెలుసుకున్నాను నే నది కొంత.
కొద్దిపాటిదే కాని, ఆ యెరుకే కలిగించింది నాకీ ధైర్యసాహసాలు.
ఈ దిలాసాతో పూనుకున్నా న్నేనందుకు.
బాగానే వుంది, అయితే, మరి కథ?
ఇదొక గడ్డు సమస్య అయిపోయింది నాకు.
బంకించంద్రుడి నవలలు చదవడంవల్లనే యిది యిలా తటస్థించింది.
ఏమంటే?
బంకించంద్రుడి నవలలు, ప్రాయికంగా, బంగాళాదేశ చరిత్రకూ, బంగాళీ జీవితానికి, బంగాళీ సంప్రదాయానికీ, బంగాళీ జాతీయతకూ సంబంధించినవి.
తన రచనలో, పాతకొత్తలకు సమన్వయపద్ధతి ప్రవేశపెట్టీ జీవితానికి కొత్త విలవలు కట్టీ, జాతికి కొత్తతోవలు కనపరిచీ, పురుషకారానికి నవశక్తి సంఘటించడానికి పూనుకున్నా డతను.
అపహాస్యం చెయ్యడానికీ, హాస్యం పుట్టించడానికిన్నీ కాక ఆత్మజ్ఞానమూ, ఆత్మవిశ్వాసమూ, ఆత్మగౌరవమూ, ఆత్మత్యాగమూ, దీక్షా, ఏకాగ్రతా, దక్షతా -
401
శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి